ఇతర దేశాల్లో మహిళల కోటా ఎంతంటే..

ఇతర దేశాల్లో మహిళల కోటా ఎంతంటే..

పార్లమెంట్‌‌లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి అమెరికా, యునైటెడ్ కింగ్‌‌డమ్‌‌తో సహా ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే భారతదేశానిది పేలవమైన రికార్డు. ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (ఐపియు) డాటా ప్రకారం, లోక్​ సభలో మహిళల శాతం పరంగా185 దేశాలలో భారతదేశం స్థానం 141.

  • ప్రస్తుతం, భారతదేశం 545 మంది సభ్యులున్న లోక్‌‌ సభలో 78 మంది మహిళా ఎంపీలను కలిగి ఉంది. ఇది సభ మొత్తం సభ్యత్వంలో14 శాతం. భారతదేశంలోని మెజారిటీ రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళా శాసనసభ్యులు15 శాతం కంటే తక్కువ ఉన్నారు.
  • ఐపియు డాటా ప్రకారం, రువాండాలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మహిళా చట్టసభ్యులు ఉన్నారు. అక్కడ లోక్​ సభలో 80 సీట్లు ఉంటే అందులో 49 మంది మహిళలే. అంటే దాదాపు 61 శాతం అన్నమాట.
  • లోక్​ సభలో 46.2 శాతం మహిళల ప్రాతినిధ్యంఉన్న దక్షిణాఫ్రికా మహిళా శాసనసభ్యుల శాతంలో యుఎస్, యుకె, ఆస్ట్రేలియా, జర్మనీ, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందు ఉంది.
  • మహిళా కోటా ఉన్న దేశాలు ఇవి...
  • భారతదేశ రాజ్యాంగంలోని 73, 74వ సవరణల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ సంస్థల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్​ చేయాలి. అలాగే పంచాయతీ రాజ్ సంస్థల్లోని అన్ని స్థాయిల్లోని చైర్‌‌పర్సన్ కార్యాలయాల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి. వాటిలో పట్టణ స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి.

పాకిస్తాన్

  • 2002 తర్వాత, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 357 సీట్లలో 60 సీట్లను మహిళలకు కేటాయించింది. అంటే దాదాపు17 శాతం. అయితే, అంతకు ముందు కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కాకపోతే1956 నాటి పాకిస్తాన్ రాజ్యాంగం అప్పటి ఏకసభ్య పార్లమెంట్‌‌లో పది స్థానాలను మహిళలకు కేటాయించింది.
  • పాకిస్తాన్ రాజ్యాంగం1962 ప్రకారం, తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ నుండి మూడు సీట్లు సహా నేషనల్ అసెంబ్లీలో ఆరు సీట్లు మహిళలకు రిజర్వ్ చేశారు.
  • 1973 నాటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు లేదా మూడవ సార్వత్రిక ఎన్నికల రోజు నుండి పదేళ్లపాటు మహిళలకు పది స్థానాలను రిజర్వ్ చేసింది.
  • 1985లో, పాకిస్తాన్ మహిళలకు రిజర్వేషన్ సీట్ల సంఖ్యను 10 నుంచి 20కి పెంచింది. 2002లో పర్వేజ్ ముషారఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని 60కి పెంచింది.
  • అయితే కోటాల కారణంగా రాజకీయ పార్టీలు అధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చినప్పటికీ, వాళ్లు ఎక్కువగా రిజర్వ్‌‌డ్ సీట్లకే పరిమితం అయ్యారు. ఐపియు డాటా ప్రకారం లోక్​ సభలోని 342 సీట్లలో 70 సీట్లు లేదా 20 శాతం మహిళా శాస నసభ్యులు ప్రస్తుతం పాకిస్తాన్‌‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే 20 శాతం కం టే ఎక్కువ లేదా 342 సీట్లలో 70 సీట్లు మహిళలు పాకిస్తాన్​ అసెంబ్లీలో ఉన్నారు.

ఫిలిప్పీన్స్​లో...

ఫిలిప్పీన్స్ లో 40 శాతం మహిళా కోటా ఉంది. ఫిలిప్పీన్​ మహిళా కమిషన్​ ప్రకారం ఆ దేశ పార్లమెంట్​లో 28 శాతం మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువ. లోక్​ సభలోని 311 సీట్లలో  ప్రస్తుతం 85 మంది మహిళా సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న ఆగ్నేయాసియా దేశాలలో ఫిలిప్పీన్స్ ఒకటి. ఇక్కడ ప్రాంతీయ రాజకీయాల్లో మహిళల సంఖ్య ఎక్కువ.

బంగ్లాదేశ్​

బంగ్లాదేశ్​లోని ఏకైక శాసనసభలో 350 సీట్లలో 50 మహిళలకు రిజర్వు అయ్యాయి. బంగ్లాదేశ్‌‌లోని అత్యున్నత శాసన సభ అయిన జతియా సంగ్‌‌సద్‌‌లో ప్రస్తుతం 20 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉంది, అంటే 73 స్థానాల్లో మహిళా శాసనసభ్యులు ఉన్నారు. బంగ్లాదేశ్ మొదటిసారిగా 1972లో పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్‌‌ను ప్రవేశపెట్టింది. 10 సంవత్సరాలకు15 సీట్లను రిజర్వ్ చేసింది. 1979లో తరువాతి 15 సంవత్సరాలకు రిజర్వ్‌‌డ్ స్థానాలను 30కి పెంచడంతో మొత్తం పార్లమెంటు స్థానాల సంఖ్య 330కి చేరింది. 2011లో రాజ్యాంగంలోని 15వ సవరణ ద్వారా బంగ్లాదేశ్‌‌లో మహిళలకు 50 సీట్లు కేటాయించారు. అలా జాతీయ పార్లమెంట్‌‌లో మొత్తం సీట్ల సంఖ్య 350కి చేరుకుంది.

ఇతర దేశాలు

1990ల ప్రారంభంలో నేపాల్, అర్జెంటీనా రాజకీయ పార్టీలు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మహిళలకు కనీస కోటా నిర్ణయించాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అభ్యర్థుల జాబితాలో 50 శాతం వరకు మహిళల కోటాను ఫ్రాన్స్, దక్షిణ కొరియా, నేపాల్ ఆమోదించాయి. అర్జెంటీనా, మెక్సికో, కోస్టారికా వంటి దేశాలు పార్టీ కోటాలను చట్టబద్ధం చేశాయి. అక్కడ జాతీయ చట్ట సభల్లో 36 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యం ఉంది. దక్షిణాఫ్రికా, స్వీడన్, జర్మనీ రాజకీయ పార్టీలు ఆమోదించిన స్వచ్ఛంద కోటాల ద్వారా మహిళా ప్రాతినిధ్యం అధికంగా పెరిగింది. ఎరిట్రియా,  టాంజానియా వంటి ఇతర ఆఫ్రికన్ దేశాలు కూడా రాజకీయాల్లో మహిళల కోటాకు ప్రత్యేకంగా కొన్ని  నిబంధనలు పెట్టుకున్నాయి.