
- జీడీపీ పరంగా తాజాగా నాలుగో స్థానానికి
- లివింగ్ కాస్ట్‌ను పరిగణనలోకి తీసుకొని పీపీపీ లెక్కలు
- ఒకే ప్రొడక్ట్ ధర వేరు వేరు దేశాల్లో వేరుగా ఉంటుంది
- గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో జీడీపీని పరిగణిస్తారు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ తాజాగా 4.187 ట్రిలియన్ డాలర్లను దాటి జపాన్ ఆర్థిక వ్యవస్థను స్వల్పంగా అధిగమించింది. దీంతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచింది. కానీ, ఇదంతా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) లెక్కల ఆధారంగా. ఒక దేశ ఆర్థిక సామర్ధ్యాన్ని కొలవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇందులో పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ఒకటి. ఐఎంఎఫ్ డేటా ప్రకారం, 2024 నాటికి ఇండియా ఎకానమీ పీపీపీ పరంగా 14.59 ట్రిలియన్ డాలర్లను దాటి, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.
చైనా 35 ట్రిలియన్ డాలర్లతో టాప్‌లో కొనసాగుతుండగా, యూఎస్ 28 ట్రిలియన్ డాలర్లతో రెండో ప్లేస్‌లో ఉంది. అదే జీడీపీ పరంగా 27 ట్రిలియన్ డాలర్లతో యూఎస్ టాప్ పొజిషన్‌లో, 18 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండో ప్లేస్‌లో ఉన్నాయి. మరి ఆర్థిక వ్యవస్థను కొలవడానికి నామినల్ జీడీపీ బెటరా? పీపీపీ లెక్కలు బెటరా? వీటి గురించి కింద తెలుసుకుందాం.
నామినల్ జీడీపీ: ఒక దేశం ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తువులు, సేవల విలువను జీడీపీగా పిలుస్తారు. ఎక్స్చేంజ్ రేటు ఆధారంగా వీటి విలువను డాలర్లలో కొలుస్తారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోరు. తీసుకుంటే అది రియల్ జీడీపీ అవుతుంది. అంటే ఒక బేస్ ఇయర్‌లోని రేట్ల ఆధారంగా జీడీపీ లెక్కిస్తే అది రియల్ జీడీపీ. ప్రస్తుత ధరల దగ్గర జీడీపీ లెక్కిస్తే అది నామినల్ జీడీపీ. ఉదాహరణకు, ఇండియాలో ఒక కప్పు కాఫీ రూ.100 (1.2 డాలర్లు), అమెరికాలో దీని విలువ 5 డాలర్లు. నామినల్ జీడీపీ ఈ ధరలను డైరెక్ట్‌గా డాలర్లలో కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఇండియా ప్రొడక్షన్ విలువ తక్కువగా కనిపిస్తుంది. ఇండియా 4 ట్రిలియన్ నామినల్ జీడీపీ అంటే, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ రేట్ బట్టి దేశ ఆర్థిక ఔట్‌పుట్ విలువ ఈ స్థాయిలో ఉందని అర్థం.
పీపీపీ: పీపీపీ లివింగ్ కాస్ట్, కొనుగోళ్లలో కరెన్సీ పవర్‌ను తెలియజేస్తుంది. వివిధ దేశాలను పోల్చినప్పుడు ఆయ దేశాల్లో ప్రజల లివింగ్ కాస్ట్ ఎలా ఉంది? లోకల్ కరెన్సీతో ఎంత మేర ప్రొడక్ట్‌లు కొనొచ్చు? వంటివి పీపీపీ కొలుస్తుంది. ఉదాహరణకు, ఇండియాలో కాఫీ 1.2 డాలర్లు, అమెరికాలో 5 డాలర్లు అయితే, పీపీపీ ఇండియన్ కాఫీ "విలువ"ను అమెరికాలో 5 డాలర్ల ఖర్చుతో సమానంగా లెక్కిస్తుంది. దీని ద్వారా ఇండియా ఆర్థిక ఔట్‌పుట్ విలువ ఎక్కువగా కనిపిస్తుంది. ఇండియా 14 ట్రిలియన్ డాలర్ల పీపీపీ అంటే, లోకల్ పర్చేజింగ్ పవర్ బట్టి దేశ ఆర్థిక ఔట్‌పుట్ ఈ స్థాయిలో ఉందని అర్థం.
ఎందుకు తేడా ఉంది?
కరెన్సీ విలువ, లివింగ్ కాస్ట్: ఇండియన్ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే తక్కువ (ఒక డాలర్= రూ.85). ఇండియాలో గూడ్స్, సర్వీసెస్ ధరలు అమెరికా కంటే తక్కువ. నామినల్ జీడీపీ ఈ తేడాను పట్టించుకోదు. కానీ పీపీపీ దీనిని అడ్జస్ట్ చేస్తుంది.
లేబర్ ఖర్చులు తక్కువ: ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేబర్, సర్వీసెస్ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అందువలన ఒకే ప్రొడక్ట్ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ రేటుకే ఈ దేశాల్లో దొరుకుతుంది.
మార్కెట్ సైజ్ వర్సెస్ లోకల్ విలువ: గ్లోబల్ ఎకానమీలో ఇండియా స్థాయిని తెలియజేయడానికి , ట్రేడ్, పెట్టుబడుల సామర్ధ్యాన్ని తెలియజేయడానికి నామినల్ జీడీపీ బెటర్. లోకల్‌గా ఉన్న జీవన ప్రమాణాలను, సంక్షేమాన్ని తెలుసుకోవడానికి పీపీపీ బెటర్.
పీపీపీ, జీడీపీ పరంగా వివిధ దేశాలు (ఐఎంఎఫ్ డేటా, ట్రిలియన్ డాలర్లలో)
దేశం పీపీపీ జీడీపీ
యూఎస్ 28.78 27.36
చైనా 35.29 18.32
ఇండియా 14.59 4.187
జర్మనీ 5.69 4.59
జపాన్ 6.72 4.186