మళ్లీ భయపెడుతున్న కరోనా కేసులు

మళ్లీ భయపెడుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,329 మంది కొత్తగా కరోనా వైరస్ బారినపడ్డారు. వీరితో కలుపుకొని దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 4,32,13,435కు చేరింది. గత 24 గటంల్లో 4,216 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 10 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.41శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 1.75శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 40,370 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.69శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 194.92 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 

ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబయిలోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం అక్కడ 1,956 కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 23 తర్వాత ఇంత భారీస్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మే నెలలో ముంబయిలో 5,979 కేసులు రికార్డు కాగా.. జూన్ 1 నుంచి 10 తేదీ మధ్య కాలంలోనే 11,397 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల మొదటి 10 రోజుల్లోనే ముంబయిలో కొవిడ్ కారణంగా నలుగురు చనిపోయారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్లు తప్పని సరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.