ఇండియాలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు : కేంద్రం

ఇండియాలో ఫస్ట్ మంకీ పాక్స్ కేసు : కేంద్రం
  • ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో లక్షణాలు బయటపడ్డాయని వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటి మంకీ పాక్స్  కేసు బయటపడింది. ఇటీవలే ఆఫ్రికా దేశం నుంచి ఇండియాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్  లక్షణాలు కనిపించాయని, అతనికి టెస్టులు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. ప్రస్తుతం అతడిని ఐసొలేషన్ లో ఉంచామని, బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించింది. గత వారమే అతనిలో మంకీపాక్స్  తాలూకు లక్షణాలు కనిపించాయని, దీంతో టెస్టులు చేయగా కన్ఫర్మ్  అయినట్లు తేలిందని పేర్కొంది. ‘‘ఆ యువకుడిలో క్లేడ్ 2 వైరస్  వేరియంట్  ఉంది.

 ప్రస్తుతానికి ప్రజారోగ్యం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. 2022 జులై నుంచి ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన 30 కేసుల్లాగే ఈ కేసు కూడా ఒకటి. ఆ యువకుడికి సోకిన వేరియంట్.. గత నెల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన ఆందోళనకరమైన క్లేడ్ 1 రకానికి చెందినది కాదు” అని కేంద్రం వివరించింది. అలాగే, పాకిస్తాన్​లోని పెషావర్ లో ఐదు మంకీపాక్స్  కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక 2022 జనవరి నుంచి 2024 ఆగస్టు వరకు 120 దేశాల్లో లక్షకుపైగా మంకీ పాక్స్  కేసులు నమోదయ్యాయని, 220 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

అనుమానితులకు టెస్టులు చేయండి

మంకీపాక్స్ అనుమానితులందరికీ టెస్టులు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది. వైరస్ నిర్ధారణ అయిన పేషెంట్లకు ఆసుపత్రుల్లో ఐసొలేషన్  కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర వైద్యశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర సోమవారం రాష్ట్రాలు, యూటీలకు లేఖ రాశారు. మంకీ పాక్స్  గురించి ప్రజలు ఆందోళన చెందకుండా చూడాలని, దాని గురించి ప్రజలకు అవగాహన కల్పిచాలని పేర్కొంది. ఆ మహమ్మారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘‘ప్రస్తుతం దేశంలో పరిస్థితులను ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. 

ప్రజారోగ్య సంసిద్ధత ఏవిధంగా ఉందో రాష్ట్రాలు, యూటీలు రివ్యూ చేయాలి. హాస్పిటళ్లలో ముందుగానే ఐసొలేషన్  కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. మంకీ పాక్స్  కేసులు బయటపడితే ఏవిధంగా ఎదుర్కోవాలి ముందే ప్రిపేర్  అయి ఉండాలి. అందుకోసం అవసరమైన సుశిక్షుతులైన మానవ వనరులను సమకూర్చుకోవాలి. మంకీ పాక్స్  ఏవిధంగా ప్రబలుతుందో, దానిని ఎలా నివారించాలో ప్రజలకు అవగాహన కల్పించాలి” అని అపూర్వచంద్ర వివరించారు. మంకీ పాక్స్  మహమ్మారిని పబ్లిక్  హెల్త్  ఎమర్జెన్సీ ఆఫ్  ఇంటర్నేషనల్  కన్సర్న్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు 14న గుర్తించిందని ఆయన తెలిపారు.