2040 నాటికి భారతీయుడిని చంద్రుడి పైకి పంపాలి : శాస్త్రవేత్తలతో మోదీ

2040 నాటికి భారతీయుడిని చంద్రుడి పైకి పంపాలి  :  శాస్త్రవేత్తలతో మోదీ

2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని, 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం శాస్త్రవేత్తలను కోరారు. భారతదేశ గగన్‌యాన్ మిషన్ పురోగతిని అంచనా వేయడానికి.. భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తును నిర్ధారించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో  మోదీ భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తును వివరించారు. వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్‌తో సహా అంతర్ గ్రహ మిషన్ల కోసం కృషి చేయాలని శాస్త్రవేత్తలను కోరారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇతర సంబంధిత అధికారులు ఈ  సమావేశంలో పాల్గొన్నారు.

Also Read :- రెండు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు

చంద్రయాన్ 3 తరువాత ఇస్రో చారిత్రాత్మక ప్రాజెక్ట్ గగన్‌యాన్ మిషన్‌ ప్రయోగానికి సిద్ధమవుతోంది.  ఈ ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ మానవసహిత అంతరిక్ష నౌక మిషన్‌ కోసం మానవరహిత అంతరిక్ష ప్రయోగ పరీక్ష నౌకను (టీవీ-డీ1 టెస్ట్‌ ఫ్లయిట్‌) అక్టోబర్ 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనుంది.  ఈ క్రమంలో  గగన్ యాన్ సంసిద్దతపై మోదీ శాస్ర్తవేత్తలతో సమీక్షించి పలు సూచనలు చేశారు.