
- జీబీఐ-ఈఎం ఇండెక్స్‌లో ఇండియన్ బాండ్లను చేర్చిన జేపీ మోర్గాన్
- వచ్చే ఏడాది జూన్ 28 నుంచి అమల్లోకి
- తగ్గనున్న ప్రభుత్వం, కంపెనీల వడ్డీ ఖర్చులు
న్యూఢిల్లీ: ప్రభుత్వం, కంపెనీలు అప్పులపై చేసే వడ్డీ ఖర్చులు వచ్చే ఏడాది నుంచి తగ్గనున్నాయి. గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్– ఎమెర్జింగ్ మార్కెట్స్ (జీబీఐ–ఈఎం) లో ఇండియన్ బాండ్ల (ప్రభుత్వ సెక్యూరిటీల) ను జేపీ మోర్గాన్ యాడ్ చేయనుంది. ఈ ఇండెక్స్‌లో మన బాండ్ల విలువ 24 బిలియన్ డాలర్లు (రూ.1.99 లక్షల కోట్లు) ఉంటుంది. మొత్తం ఇండెక్స్ విలువ 240 బిలియన్ డాలర్లు (రూ. 19.90 లక్షల కోట్లు) కాగా, ఇండియన్ బాండ్లకు గరిష్టంగా 10 శాతం వెయిటేజ్ ఇచ్చారు. జీబీఐ–ఈఎం ఇండెక్స్ పాపులర్ కాబట్టి పెద్ద గ్లోబల్ ఫండ్స్ దీన్ని ట్రాక్ చేస్తుంటాయి. ఫలితంగా ఫారిన్ ఇన్వెస్టర్లు మన బాండ్లలో మరింతగా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారని ఎనలిస్టులు చెబుతున్నారు. మన బాండ్లను ఇప్పటి వరకు వాచ్ లిస్ట్‌లో పెట్టిన జేపీ మోర్గాన్ తాజాగా ఓకే చెప్పింది. వచ్చే ఏడాది జూన్ 28 నుంచి మార్చి 31, 2025 మధ్య ఈ ఇండెక్స్‌లో ఇండియన్ బాండ్లు కొనసాగుతాయి.
ఎకానమీకి బూస్ట్..
23 గవర్నమెంట్ బాండ్లు జీబీఐ–ఈఎం ఇండెక్స్‌లో చేరుతాయి. ఇవి ఎన్‌ఆర్‌ఐలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలుండే బాండ్‌లు. ‘జీబీఐ–ఈఎం గ్లోబల్ డైవర్సిఫైడ్ ఇండెక్స్‌లో ఇండియా వెయిటేజ్ 10 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. అదే జీబీఐ–ఈఎం గ్లోబల్ ఇండెక్స్‌లో సుమారు 8.7 శాతానికి చేరుకుంటుంది’ అని జేపీ మోర్గాన్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. జీబీఐ–ఈఎం ఇండెక్స్‌లో ఎంటర్ అవ్వడానికి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నామని ఏయూఎం క్యాపిటల్ నేషనల్ హెడ్ ముకేశ్ కొచ్చర్ అన్నారు. ఈ ఇండెక్స్‌లో ఇండియా వాటా 24 బిలియన్ డాలర్లని, ఇది చాలా ఎక్కువని చెప్పారు. ‘ ఇండియాలోని బేస్ రేట్లు (దీని ఆధారంగా లోన్లు లేదా ఫండ్స్‌పై వడ్డీ ఉంటుంది) మారుతాయి.
బాండ్ ఈల్డ్‌లు దిగొస్తాయి. ఇండియా అప్పులు, ఫండ్స్ సేకరణపై చేసే వడ్డీ ఖర్చులు తగ్గుతాయి. కరోనా తర్వాత నుంచి బారోవింగ్ ఖర్చులు పెరగడంతో దేశ ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతోంది’ అని ముకేశ్ అన్నారు. కాగా, ఇండియన్ బాండ్లలోకి విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా వస్తే డిమాండ్ పెరగడం వలన బాండ్ ఈల్డ్‌లు తగ్గుతాయి. బేస్ రేట్లు తగ్గడం వలన కంపెనీలు డెట్ మార్కెట్ నుంచి సేకరించే ఫండ్స్‌పై ఇచ్చే వడ్డీ కూడా దిగొస్తుంది. వీటి ఖర్చులు తగ్గుతాయి. అలానే పెద్ద మొత్తంలో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు వస్తాయి కాబట్టి రూపాయి బలపడుతుంది. జేపీ మోర్గాన్ తీసుకున్న తాజా నిర్ణయం దేశ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మేలు చేస్తుంది.