క్రూడాయిల్ ధరలు తగ్గడంతో రూ.1.8 లక్షల కోట్లు ఆదా

క్రూడాయిల్ ధరలు తగ్గడంతో రూ.1.8 లక్షల కోట్లు ఆదా
  • ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీ దిగుమతులపై మరో రూ.6 వేల కోట్లు
  • కిందటి ఆర్థిక సంవత్సరంలో క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ ఇంపోర్ట్స్‌‌‌‌‌‌‌‌పై రూ.21 లక్షల కోట్లు ఖర్చు
  • నాలుగేళ్ల దిగువకు బ్రెంట్‌‌‌‌‌‌‌‌ క్రూడ్‌ ధర

న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతి, వినియోగ దేశమైన భారత్,  క్రూడాయిల్ ధరలు తగ్గడంతో లాభపడనుంది.   క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్‌‌‌‌‌‌‌‌ నేచురల్ గ్యాస్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీ) దిగుమతులపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  రూ.1.8 లక్షల కోట్లకు పైనే  ఆదా చేయనుంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రిపోర్ట్ ప్రకారం,  85 శాతం క్రూడాయిల్ అవసరాలను  దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్నాం.

కిందటి ఆర్థిక సంవత్సరంలో  క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు ఏకంగా 242.4 బిలియన్ డాలర్ల (రూ.21 లక్షల కోట్ల) ను ఇండియా  ఖర్చు చేసిందని అంచనా.  మరోవైపు వంటగ్యాస్‌‌‌‌‌‌‌‌, సీఎన్జీ వంటివి ఉత్పత్తి చేయడానికి వినియోగించే ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీ దిగుమతులను కూడా భారీగా చేసుకుంటోంది. 2024–25లో వీటి దిగుమతుల కోసం 15.2 బిలియన్ డాలర్లు (రూ.1.31 లక్షల కోట్ల) ఖర్చు అయ్యింది.

60 డాలర్లకు బ్రెంట్‌‌‌‌‌‌‌‌ క్రూడ్‌‌‌‌‌‌‌‌ ..

గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా సప్లయ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతుందనే భయాలు,  డిమాండ్‌‌‌‌‌‌‌‌పై  అనిశ్చితి నెలకొనడంతో ఈ వారం ప్రారంభంలో చమురు ధరలు నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌ బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 60.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ కూడా నాలుగేళ్ల కనిష్టానికి దిగొచ్చింది.  అయినప్పటికీ ఇండియాలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ ధరలను ప్రభుత్వం తగ్గించడం లేదు. కిందటేడాది లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌‌‌‌‌‌‌‌కు రూ.2 చొప్పున తగ్గించారు. 

"ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026) క్రూడ్ ధరలు సగటున బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 60–-70 డాలర్ల రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి’’  అని ఇక్రా అంచనా వేస్తోంది.  ఈ స్థాయిలో క్రూడ్ ఆయిల్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేసే ఇండియన్ అప్‌‌‌‌‌‌‌‌స్ట్రీమ్  కంపెనీల ఆదాయం 2025-–26లో రూ.25 వేల కోట్లు తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ వీటి క్యాపెక్స్ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌లో ఎటువంటి మార్పు ఉండదని తెలిపింది.   

"అయితే, క్రూడ్ దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్లు, ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీ దిగుమతులపై రూ.6,000 కోట్లు ఆదా అవుతాయి" అని లెక్కించింది.  పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్ అమ్మే  మార్కెటింగ్ కంపెనీలకు భారీ లాభాలొస్తాయి.  ఎల్‌‌‌‌‌‌‌‌పీజీని సబ్సిడీకి అమ్మడం వలన వచ్చే  నష్టాలను పూడ్చుకోవడానికి వీటికి వీలుంటుంది.

టారిఫ్ ప్రభావం..

గ్లోబల్ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు, ఒపెక్‌‌‌‌‌‌‌‌+ తమ ఉత్పత్తిని పెంచుతామని ప్రకటించడంతో  క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పడిపోతోంది. టారిఫ్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గ్లోబల్ ఆర్థిక  వ్యవస్థ మందగమనంలో ఉండగా, ఆయిల్ వినియోగం తగ్గుతుందనే భయాలు ఎక్కువయ్యాయి. మరోవైపు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉండడంతో ఆయిల్ రేట్లు దిగొస్తున్నాయి. ఒపెక్‌‌‌‌‌‌‌‌ ప్లస్ దేశాలు  ఈ ఏడాది మే నుంచి రోజుకు 4,11,000 బ్యారెల్స్, జూన్ నుంచి మరో 4,11,000 బ్యారెల్స్ చమురు ఉత్పత్తిని పెంచుతామని ప్రకటించాయి. 

బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌ రేటు ఈ ఏడాది మార్చి 31 నాటికి  బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 77 డాలర్ల వద్ద ట్రేడవ్వగా, ప్రస్తుతం 60-62 డాలర్ల వద్ద కదులుతోంది. ఐఓసీ, బీపీసీఎల్‌‌‌‌‌‌‌‌ వంటి  ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌పై లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సగటున రూ.2.5-4 మార్జిన్ వస్తుందని అంచనా.  క్రూడ్ ధరలు తగ్గడంతో ఎల్‌‌‌‌‌‌‌‌పీజీపై నష్టాలు పూడ్చుకోవడానికి వీలుంటుంది. 

కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు డీరెగ్యులేట్ అయినప్పటికీ, కుకింగ్ గ్యాస్ ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ ధరలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు  ఈ ఫ్యూయల్‌‌‌‌‌‌‌‌ను కాస్ట్ ప్రైస్‌‌‌‌‌‌‌‌ కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి.  అండర్-రికవరీని (వచ్చే నష్టాన్ని)  ప్రభుత్వం సబ్సిడీ రూపంలో కాంపెన్సేట్ చేస్తోంది.