
- బ్రిటన్ నుంచి పెట్టుబడులు వస్తాయంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: భారత్, యూనైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ)తో ఇండియా ఎగుమతులు పెరుగుతాయని, బ్రిటన్ నుంచి పెట్టుబడులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ)పై ఇరు దేశాలు ఈ ఏడాది జులై 24న సంతకం చేశాయి. ఇది వచ్చే ఏడాది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా టెక్స్‌టైల్స్, ఆటోమోటివ్ భాగాలు, షూస్, ఫార్మా వంటి కీలక రంగాల్లో భారత ఎగుమతులకు 99శాతం డ్యూటీ- ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది.
అలాగే, సర్వీసుల రంగంలో ఐటీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ప్రొఫెషనల్ సేవల కోసం యూకే మార్కెట్‌లో అనేక అవకాశాలు ఉన్నాయి. ‘‘ఈ ఒప్పందం ద్వారా 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం ఉన్న 54 బిలియన్ డాలర్ల నుంచి 120 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది.
ఎంఎస్‌ఎంఈలు, లేబర్ ఎక్కువగా అవసరముండే పరిశ్రమలకు ఇది మంచి అవకాశం. టారిఫ్‌లు తగ్గించడంతో పాటు, సర్వీసులు, పెట్టుబడులపై రెగ్యులేటరీ అడ్డంకులు తగ్గుతాయి”అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఈఓ) అధ్యక్షుడు ఎస్‌సీ రల్హాన్ తెలిపారు.