పాక్‍‌పై దాడిలో AI టెక్నాలజీ వాడిన ఇండియా.. అసలు ఈ ఆకాష్‌తీర్ ప్రత్యేకతలు తెలుసా..?

పాక్‍‌పై దాడిలో AI టెక్నాలజీ వాడిన ఇండియా.. అసలు ఈ ఆకాష్‌తీర్ ప్రత్యేకతలు తెలుసా..?

ఇన్నాళ్లూ భారతదేశాన్ని అనేక దేశాలు తక్కువగా అంచనా వేశాయనే విషయం ఆపరేషన్ సిందూర్ బయపెట్టింది. చాపకింద నీరులా ఇండియా తన రక్షణ అవసరాల కోసం దేశీయంగా ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకుంటూ వాటిని అమ్ములపొదిలో దాచుకుంటుందనే విషయం పాకిస్థాన్ పై చేసిన యుద్ధంలో వాడిన టెక్నాలజీ, వాటి పనితీరు ఆధారాలుగా నిలుస్తున్నాయి. కొత్తతరం సాంకేతిక యుద్ధానికి సైలెంట్ గా ఇండియా సంసిద్ధం అవుతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే పాకిస్థాన్ పై చేసిన దాడిలో ఇండియా వాడిన ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గురించిన విశేషాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి దీనిని భారత ప్రభుత్వ రంగం సంస్థలైన డీఆర్డీవో, ఇస్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా తయారు చేశాయి. పాక్ వాడిన డ్రోన్లు, మిస్సైళ్లను క్షణాల్లో నేలకూల్చటంలో ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడింది. ఇది బలమైన భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సామర్థ్యాలను మరింతగా పెంచిందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

 

పాక్ చేసిన దాడుల్లో అది పంపిన డ్రోన్లు, మిస్సైళ్లు, మైక్రో యూఏవీలు, మందుగుండు సామాగ్రిని న్యూట్రలైజ్ చేసి.. భారత్ లోకి చొరబడకుండా అడ్డుకుందని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన ఎక్స్ పోస్టులో వెల్లడించింది. అయితే ఇది ఏఐ ఆధారంగా నిర్మించబడిన తొలి వార్ క్లౌడ్ వ్యవస్థ కావటం గమనార్హం. దీనిని భారత్ పూర్తిగా దేశీయంగా తీర్చిదిద్దటంతో పాటు విదేశీ శాటిలైట్లు లేదా విడిభాగాలపై ఆధారపడలేదని వెల్లడైంది. ఆకాష్ తీర్ రియల్ టైంలో ఎయిర్ ఫొటోలను రాడార్లు, కంట్రోల్ రూమ్స్, ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటికి పంపేది. దీంతో ఏఐ ఆధారంగా శాటిలైట్ వ్యవస్థలను సమన్వయం చేసుకుని పాక్ దాడులను మట్టికరిపించి మేడ్ ఇన్ ఇండియా సత్తాను చాటింది. 

అయితే మరోపక్క పాకిస్థాన్ మాత్రం చైనా నుంచి తెచ్చుకున్న HQ- 9, HQ-16 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విఫలం కావటం మనం గమనించాం. భారత రాడార్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సకాలంలో పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టడంలో అత్యంత ఖచ్చితత్వం, సమన్వయంతో వ్యవహరించి నష్టాలను భారీగా తగ్గించాయి.