మూడో టెస్టులో 78 పరుగులకే టీమిండియా ఆలౌట్

 మూడో టెస్టులో 78 పరుగులకే టీమిండియా ఆలౌట్

లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేపట్టిన భారత్ 78 పరుగులకే కుప్పకూలింది. రెండో టెస్టు అపూర్వ విజయంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఇంగ్లండ్ పేసర్లు చుక్కలు చూపించారు. 
ఓపెనర్లను విడదీసి శుభారంభం చేసిన ఇంగ్లండ్ వెంట వెంటనే మూడు వికెట్లు కూల్చి మ్యాచ్ పై పట్టు బిగించింది. దీంతో వికెట్లు కాపాడుకునేందుకు ప్రధాన్యతనిస్తూ ఇండియా బ్యాట్స్ మెన్ ఆచితూచి ఆడారు.దీంతో తొలి సెషన్స్ లో 56 పరుగులకు నాలు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, రహానే నిలదొక్కుకుని ఆడుతున్న తరుణంలో రెండో సెషన్ ప్రారంభమైన వెంటనే ఇంగ్లండ్ బౌలర్లు మళ్లీ జూలు విదిల్చారు. రెండో టెస్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లు, ఫీల్డర్లు కసిగా బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తూ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. దీంతో రెండో సెషన్ లో భారత్ కేవలం 22 పరుగులు చేసి 78 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (19), రహానే (18) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలువగా కేఎల్ రాహుల్ (0), చటేశ్వర్ (1), విరాట్ కోహ్లి (7), పంత్ (2), జడేజా (4) పరుగులతో చేతులెత్తేశారు. ఇంగ్లండ్ బౌలింగ్ విషయానికి వస్తే అండర్సన్ ఈసారి కూడా కోహ్లిని టార్గెట్ చేసి వికెట్ పడగొట్టాడు. అండర్సన్ , ఓవర్టన్ చెరి మూడు వికెట్లు పడగొట్టగా, రాబిన్సన్, సామ్ కరణ్ లు కూడా చెరి రెండు వికెట్లు కూల్చారు. 
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోహ్లి
రెండో టెస్టు ఘన విజయంతో అదే జట్టుతో బరిలోకి దిగింది భారత్. ప్రతిసారి జట్టులో ఏదో ఒక మార్పుతో బరిలోకి దిగే కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారి మాత్రం సెకండ్ టెస్టు గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగాడు. కెప్టెన్ గా ఇప్పటి వరకు 64 మ్యాచులకు సారధ్యం వహించిన విరాట్ కోహ్లి జట్టును ఏమాత్రం మార్చకుండా బరిలోకి దిగడం కేవలం నాలుగోసారి మాత్రమే. సెకండ్ టెస్టు విజయం ఇచ్చిన ఉత్సాహంతో  టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎంతో ఉత్సాహంగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు తొలి ఓవర్లోనే చుక్కెదురైంది. రెండు టెస్టుల్లో టాప్ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్ 4 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అండర్సన్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బాల్ బ్యాట్ అంచులను తాకుతూ నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఇంగ్లండ్ టీమ్ సంబరాలు చేసుకోగా భారత్ జట్టుకు షాక్ తగిలింది. దీంతో ఓపెనర్ కు తోడుగా బరిలోకి దిగిన ఛటేశ్వర్ పుజారా ఆచితూచి ఆడాడు. 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన పుజారా 9వ బంతికి షాట్ ఆడబోయి కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
పెవిలియన్ కు క్యూ కట్టిన భారత జట్టు
వరుసగా వికెట్లు పడుతుండడంతో మ్యాచ్ లో భారత జట్టు డిఫెన్స్ లో పడిపోయింది.  ఓపెనర్ రోహిత్ శర్మకు తోడుగా బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఫోర్ కొట్టి జట్టును ఒత్తిడి నుంచి బయటపడేసే ప్రయత్నం చేశాడు. అదే ఊపును కొనసాగించబోయి అండర్సన్ వేసిన బంతికి షాట్ ఆడబోగా బంతి బ్యాట్ ను టచ్ చేస్తూ నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లిపోవడంతో కోహ్లి పెవిలియన్ కు వెనుదిరిగాడు. దీంతో భారత జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది. రోహిత్ శర్మకు తోడుగా బరిలోకి దిగిన రహానే బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ మెల్లగా స్కోరు పరిగెత్తించే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ బ్రేక్ కు ముందు రహానే ఔట్ కావడంతో భారత జట్టు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. పంత్, మహమ్మద్ షమిలు నిరాశపరచడంతో భారత్ 78పరుగులకే చాప చుట్టేసింది. 
భారత్ ను కట్టడి చేసిన ఉత్సాహంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీ బ్రేక్ సమయానికి ఓపెనర్లు 7 ఓవర్లు ఆడి 21 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఓపెనర్లు హమీద్ (15), బర్న్ (3) పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.