కాంగ్రెస్​ బలపడితేనే.. ప్రతిపక్షాల ఐక్యత ఫలిస్తుంది!

కాంగ్రెస్​ బలపడితేనే.. ప్రతిపక్షాల ఐక్యత ఫలిస్తుంది!

కర్నాటకలోని బెంగళూరులో జులై 18న ప్రతిపక్ష పార్టీలు ఎన్​డీఏతో తలపడేందుకు ‘ఇండియా’ను ఏర్పాటు చేయడంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వర్సెస్ ఎన్‌‌‌‌డీఎగా పోటీకి వేదిక సిద్ధమైంది. అయితే ప్రతిపక్ష కూటమి తన ఎజెండాను బలపర్చేందుకు ఇంకా అధ్యక్షుడిగా, కన్వీనర్‌‌‌‌గా ఎవరినీ ప్రతిపాదించలేదు. అయితే మేము నిలబడతామనే మద్దతు మాత్రం స్పష్టమైంది. ఒక ప్రారంభం జరిగింది, కానీ ప్రతిపక్షం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి.  ప్రత్యర్థి పార్టీలను ఒకదాని తర్వాత ఒకటి లక్ష్యంగా చేసుకుని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణకు భయపడి.. తమ సొంత పార్టీలను కాపాడుకోవడానికి ఏకం కావడం తప్ప మరో మార్గం లేదని చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గ్రహించాయి. 

బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడమే కాకుండా, ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల దాడుల ద్వారా అమలు చేసిన వ్యూహాలు, డబ్బు, కండబలాన్ని దుర్వినియోగం లాంటివన్నీ ప్రతిపక్షాల్లో ఒక వ్యూహం రూపొందడానికి దారితీశాయి. ఇండియా కూటమి చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టవచ్చు. నిజానికి మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే ప్రతిపక్ష అభ్యర్థిని పోటీకి దింపాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మొదట్లోనే చేసిన ఆలోచన ఆశాజనకంగా అనిపించినా, అది కూడా సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

అంత సులభం కాదు..

విపక్షాల ఐక్యత కుదిరితే 2024లో లోక్‌‌‌‌సభలో బీజేపీ100 సీట్ల కంటే తక్కువకు పరిమితం అవుతుందని ఆ మధ్య బీహార్ సీఎం నితీష్ కుమార్ జోస్యం చెప్పారు. కానీ గ్రౌండ్​ లెవెల్​లో అది అంత సులభం కాదు. యూపీలో బీఎస్పీ(80 సీట్లు), తెలంగాణలో బీఆర్ఎస్(17 సీట్లు), ఏపీలో టీడీపీ, వైఎస్సార్​సీపీ(25 సీట్లు), ఒడిశాలో బీజేడీ(21 సీట్లు) వంటి పార్టీలు143 లోక్‌‌‌‌సభ స్థానాలను ప్రభావితం చేస్తే.. ప్రతిపక్షాలకు బీజేపీని కొట్టడం కష్టతరం అవుతుంది. ఢిల్లీలో(7 సీట్లు), పంజాబ్‌‌‌‌లో (13) ఆప్​ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కూడా అదనంగా 20 సీట్లు పొందడమూ సమస్యాత్మకమే. ఎందుకంటే ఢిల్లీ పీసీసీ, పంజాబ్ పీసీసీ రెండూ ఆప్​తో కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఆప్ ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఆ రెండు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పలేం. ఇలా మొత్తం163 స్థానాల్లో ప్రతిపక్ష కూటమిలో లేని, ఉన్న ఇతర పార్టీల ప్రభావం ఉండొచ్చు. ఆప్ ​లాగే టీఎంసీ, జనతాదళ్​యునైటెడ్, ఎన్​సీపీ వంటి పార్టీలు ప్రతిపక్ష ఐక్యతకు కలిసి వచ్చినా.. ఆయా రాష్ట్రాల్లో అవి గెలిచేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ముఖ్యంగా కూటమిలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ నుంచి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయవచ్చు, తద్వారా కాంగ్రెస్‌‌‌‌కు పోటీ చేయడానికి తక్కువ సంఖ్యలో సీట్లు మిగులుతాయి. 

అందుకే ప్రతిపక్షాల ఐక్యత నిజంగా సవాలుతో కూడుకున్న అంశం. బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలబెట్టే సమస్యను ఎలాగోలా పరిష్కరించినా.. కనీస ఉమ్మడి కార్యక్రమం సిద్ధం చేయడం అంత తేలిక కాదు. యూనిఫాం సివిల్ కోడ్, ఆర్టికల్370, లౌకికవాదం, హిందూత్వం మొదలైన ముఖ్యమైన సమస్యలపై కూడా చాలా ప్రతిపక్షాలు ఒకే స్వరంతో మాట్లాడలేకపోతున్నాయి. ఆప్, ఉద్ధవ్ థాక్రే శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. మరి వారి తుది స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మోదీ వ్యతిరేక సెంటిమెంట్ మాత్రమే వారిని కలిసి ఉంచే జిగురులా కనిపిస్తున్నది. అది సరిపోకపోవచ్చు. ఇప్పటివరకు, ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యక్రమం, ప్రజల ఆకాంక్షలను పట్టుకోగల ఉమ్మడి కార్యాచరణ నిర్వహించడం వంటి రాజకీయ వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమయ్యాయి. ముందుకు వెళ్లేందుకు ప్రతిపక్షానికి రోడ్‌‌‌‌మ్యాప్‌‌‌‌ తప్పనిసరి. 

 మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ తప్పక గెలిస్తేనే..

ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయించే రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ మధ్య నేరుగా పోటీ ఉన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు గుజరాత్ (26), రాజస్థాన్ (25), మధ్యప్రదేశ్ (29), చత్తీస్‌‌‌‌గఢ్ (11), హర్యానా(10), హిమాచల్ ప్రదేశ్(4), ఉత్తరాఖండ్(5), గోవా (2), లక్షద్వీప్(1), కర్నాటక(28), సిక్కిం(24) మినహాయిస్తే 165 స్థానాలు కలుపుకుంటే, ఇక్కడ కాంగ్రెస్‌‌‌‌కి బీజేపీతో ప్రత్యక్ష పోటీ ఉంది. లోక్‌‌‌‌సభలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించాలంటే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉండాలి. మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమిగా ఉంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడా లెక్కలోకి రాదు. మొట్టమొదట, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నడిపించడానికి కాంగ్రెస్ పునరుజ్జీవనం పొందాలి. బలహీనమైన కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కొనే కూటమికి ఆధారం కాలేదు. కాంగ్రెస్ పార్టీ తనను తాను పునర్నిర్మించుకొని బలంగా తయారు కావాలి. అప్పుడే అది ఇతర ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించగలదు, పొత్తు పెట్టుకోగలదు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, మధ్యప్రదేశ్‌‌‌‌లో బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఈ దిశలో మొదటి అడుగు. ఈ మూడు చోట్ల విజయం సాధిస్తేనే.. ప్రతిపక్షాల ఐక్యతను అది ముందుకు తీసుకువెళ్లగలదు.

37 శాతం ఓట్లే కదా?

మోదీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం.. తాత్కాలికంగా ఒకదానికొకటి కండ్లతో చూడని ప్రాంతీయ పార్టీలన్నీ పెద్ద లక్ష్యం కోసం తమ విభేదాలను పక్కకుపెట్టేలా చేసింది. అందులో భాగంగానే మొన్న బెంగళూరు మీటింగ్​లో సోనియా గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్​యాదవ్, నితీష్ కుమార్, శరద్ పవార్ ఇలా అందరినీ ఒకే ఫ్రేమ్‌‌‌‌లో చూశాం. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏ కూటమిలోనూ భాగస్వామ్యం కాకపోగా.. బీజేడీ, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్​సీపీ వంటి ఇతరులు వారితో చేతులు కలపకపోవచ్చు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో విజయం సాధించిన తరువాత.. మోదీని ఓడించడం సాధ్యమే అని ప్రతిపక్షాలు నిరూపించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని కాంగ్రెస్ ఒంటరిగా ఓడించగలిగితే, ఇతర రాష్ట్రాల్లోనూ ఎందుకు విజయం సాధించలేకపోయిందనేది ప్రశ్న. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 37 శాతం ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న అంచనాతో ప్రతిపక్ష కూటమి ఎత్తుగడలు వేస్తున్నది. సిద్ధాంతపరంగా, మిగిలిన 63 శాతం ఓట్లను ఏకీకృతం చేస్తే, స్వయంచాలకంగా కాషాయ పార్టీని ఓడించవచ్చన్నది దాని ఆలోచన. 

ప్రధాని అభ్యర్థి అసలు సమస్య

ప్రతిపక్ష కూటమిలో గల ప్రధాన సమస్య ప్రధాని అభ్యర్థి. అన్ని పార్టీలు ఉన్న కూటమిలో ఎవరు ప్రధాని అభ్యర్థి అనేది పెద్ద చిక్కు ప్రశ్నే. మమతా, నితీష్, శరద్ పవార్ లాంటి వారు సహా చాలా మంది ప్రధానమంత్రి కావాలని కోరిక ఉన్నవారే. రాహుల్ గాంధీని లేదా మరే ఇతర కాంగ్రెస్ నాయకుడిని ప్రధానిని చేయకూడదనే ఏకైక ఎజెండాతో కొన్ని పార్టీలు కూటమిలో చేరాయి. ఎన్నిల ముందు అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి ఎలాగూ లేదు కాబట్టి బహుశా, నాయకత్వ సమస్య ఎన్నికల తర్వాత వరకు వాయిదా వేయవచ్చు. కానీ ప్రజలు నరేంద్ర మోడీని ఎదుర్కొనే నాయకుడి పేరును తెలుసుకోవడానికి ఇష్టపడతారన్న విషయం ముఖ్యమైనది. ప్రధాని పదవిని మరెవరికీ అప్పగించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. 2024లో లోక్‌‌‌‌సభలో సొంత సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకోవడంపై సొంత కార్యాచరణ కలిగి ఉన్న హస్తం పార్టీ.. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరపడానికి అన్ని మార్గాలను తెరిచి ఉంచుతోంది.

- అనితా సలూజా, పొలిటికల్ ​ఎనలిస్ట్