అక్టోబర్ 15 పాక్‌కు స్పెషల్ డే.. మరి ఇండియా గెలుస్తుందా?

అక్టోబర్ 15 పాక్‌కు స్పెషల్ డే.. మరి ఇండియా గెలుస్తుందా?

వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైందో.. లేదో.. అప్పుడే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ గురించి చర్చ మొదలైపోయింది. తమదంటే తమది గెలుపుని ఇరుదేశాల మాజీ ఆటగాళ్లు నమ్మకంగా చెప్తున్నారు. అయితే ఒక విషయం భారత అభిమానులను టెన్షన్ పెడుతోంది. అందుకు ప్రధాన కారణం.. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజాం. 

అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇండియా- పాక్ మ్యాచ్ జరగనుంది. ఆ రోజు పాకిస్తాన్ జట్టుకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఆరోజు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పుట్టిన రోజు. ఆ మ్యాచ్ ఎలాగైనా గెలిచి తమ కెప్టెన్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని పాకిస్తాన్ ఆటగాళ్లు భావిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే భారత అభిమానులను కలవరపెడుతోంది. అసలే నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటర్లకు, పేసర్లకు స్వర్గధామం. అలాంటి పిచ్‌పై పాక్ బ్యాటర్లు, పేసర్లు చెలరేగిపోతే ఏంటా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా పాక్.. 

బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ హరీస్, హరీస్ సోహైల్.. ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ జట్టులో బ్యాటర్లకు కొదవలేదు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ రూపంలో మరో ఇద్దరు ఆల్‌రౌండర్లు కూడా అందుబాటులో ఉన్నారు. వీరికి తోడు షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్ వంటి పాక్ పేసర్ల దళం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఏమాత్రం అలసత్వం వహించినా భారత జట్టు మూల్యం చెల్లించుకోక తప్పదు. 

ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ గెలవని పాక్ 

ఇక వన్డే ప్రపంచకప్‌ మ్యాచుల్లో పాకిస్తాన్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచులోనూ గెలవలేదు. ఆడిన ఏడింటిలోనూ ఓటమిపాలైంది. ఇప్పుడు ఆ రికార్డును మార్చాలన్నదే వారి తాపత్రయం. అసలే భారత జట్టు.. పాక్ పర్యటనకు రాలేదన్న కోపం వారిలో మరింత కసిని పెంచుతోంది. ఏదేమైనా స్వదేశంలో మ్యాచ్ జరుగుతుండటం భారత్ కు కలిసొచ్చేదో కనుక టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.