
రైన్ రుహ్ర్, ఎసెన్ (జర్మనీ): ఎఫ్‌ఐఎస్‌యూ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌ను ఇండియా 12 పతకాలతో ముగించింది. ఇందులో రెండు గోల్డ్, ఐదు సిల్వర్, ఐదు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మొత్తం 300 మంది అథ్లెట్లు 3X3 బాస్కెట్‌బాల్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బీచ్ వాలీబాల్, ఫెన్సింగ్, జూడో, రోయింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, టెన్నిస్, వాలీబాల్‌లో పోటీపడ్డారు. 2021 చెంగ్డూలో జరిగిన పోటీల్లో ఇండియా 26 మెడల్స్ (11 గోల్డ్, 5 సిల్వర్, 10 బ్రాంజ్) సాధించింది.
పర్నీత్ కౌర్‌కు మూడు మెడల్స్
ఈ టోర్నీలో ఇండియన్ ఆర్చర్లు రెండు స్వర్ణాలు, రెండు సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్‌ను గెలిచారు. ముఖ్యంగా ఆర్చర్ పర్నీత్ కౌర్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్‌లో కుశాల్ దలాల్‌తో కలిసి బరిలోకి దిగిన పర్నీత్ స్వర్ణం నెగ్గింది. వ్యక్తిగత విభాగంలో సిల్వర్ గెలిచిన పర్నీత్.. టీమ్ ఈవెంట్‌లో అవ్నీత్ కౌర్–మధుర ధమనగోంకర్‌తో కలిసి బ్రాంజ్ మెడల్‌ను సాధించింది. మెన్స్ ఇండివిడ్యువల్ కాంపౌండ్ కేటగిరీలో సాహిల్ రాజేశ్ జాదవ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. కుశాల్ దలాల్–సాహిత్ రాజేశ్–హ్రితిక్ శర్మతో కూడిన మెన్స్ కాంపౌండ్ టీమ్ సిల్వర్‌ను గెలిచింది.
వైష్ణవికి బ్రాంజ్...
టెన్నిస్‌లో వైష్ణవి అడ్కర్ కాంస్యం సాధించింది. దీంతో ఈ టోర్నీలో పతకం నెగ్గిన రెండో టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. 1979 మెక్సికో సిటీలో జరిగిన గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్‌లో నందల్ బాల్ సిల్వర్ నెగ్గాడు. బ్రాంజ్ కోసం జరిగిన మ్యాచ్‌లో వైష్ణవి 6–2, 4–6, 4–6తో ఎజ్టర్ మేరీ (స్లోవేకియా) చేతిలో ఓడింది.
అథ్లెటిక్స్‌లో ఐదు పతకాలు
అథ్లెటిక్స్‌లో అంకితా దయానీ (విమెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్), సీమా (విమెన్స్ 5 వేల మీటర్లు), ప్రవీణ్ చిత్రవేల్ (మెన్స్ ట్రిపుల్ జంప్) సిల్వర్ మెడల్స్ గెలిచారు. మెన్స్ 4X100 మీటర్ల రిలేలో అనిమేష్ కుజుర్–మణికంఠ హోబ్లిధర్–లాలు ప్రసాద్ బోయ్–జయరామ్ దొండపాటితో కూడిన టీమ్ కాంస్యం సాధించింది. విమెన్స్ 20 కిలో మీటర్ల వాక్ టీమ్ (మాన్సి నేగి–సెజల్ అనిల్ సింగ్–మహిమ చౌదరీ–మునితా ప్రజాపతి–షాలిని) బ్రాంజ్‌ను గెలుచుకుంది. టోర్నీ చరిత్రలో ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు తొలిసారి బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. మిక్స్‌డ్ టీమ్ సెమీస్‌లో ఇండియా...
చైనీస్ తైపీ చేతిలో ఓడింది.