హార్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా అమ్మాయిల జట్టు పోరాటం ముగిసింది. సోమవారం రాత్రి జరిగిన గ్రూప్–ఎ చివరి మ్యాచ్‌లో ఇండియా 0–5 తేడాతో చైనా చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో పీవీ సింధు 16–21, 21–19, 19–21తో వరల్డ్ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్‌లో సింధు 18–12తో ఉన్న టైమ్‌లో తడబడింది. చైనీస్ ప్లేయర్ కొట్టిన షాట్లను తీయలేక ఇబ్బందిపడింది.
డబుల్స్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా 11–21, 8–21తో లియు షెంగ్ షు–టాన్ నింగ్ చేతిలో కంగుతిన్నది. రెండో సింగిల్స్‌లో ఇషారాణి 20–22, 13–21తో చెన్ యు ఫి చేతిలో, రెండో డబుల్స్‌లో తానీషా క్రాస్టో–కవిప్రియ సెల్వం 21–10, 12–21, 19–21తో లు జు మిన్–జాంగ్ షు జియాన్ చేతిలో, ఆఖరి సింగిల్స్‌లో దేవిక 21–19, 17–21, 10–21తో జు వెన్ జింగ్ చేతిలో పోరాడి ఓడారు. థామస్ కప్‌లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో ఇండియా.. చైనాతో తలపడుతుంది.

