కరోనా ట్రీట్మెంట్‌పై రీసెర్చ్‌లో సక్సెస్: 14 ఏళ్ల ఇండియన్ అమెరికన్ అనికా చేబ్రోలుకు 25 వేల డాలర్ల ప్రైజ్

కరోనా ట్రీట్మెంట్‌పై రీసెర్చ్‌లో సక్సెస్: 14 ఏళ్ల ఇండియన్ అమెరికన్ అనికా చేబ్రోలుకు 25 వేల డాలర్ల ప్రైజ్

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అతి పెద్ద పజిల్.. కరోనా భయానికి ముగింపు ఎప్పుడు? ఈ మహమ్మారికి చెక్ చెప్పే మందులు ఎప్పుడొస్తాయి? గతంలో మాదిరిగా మళ్లీ ఏ భయం లేకుండా తిరగడం ఎప్పటికి సాధ్యం? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచంలోనే పెద్ద పెద్ద సైంటిస్టులంతా ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ తయారీ కోసం పరిశోధనలు చేస్తున్నారు. అయితే అతి చిన్న వయసులో ఇండియన్ అమెరికన్ అమ్మాయి కరోనాకు ట్రీట్మెంట్ కనిపెట్టడంలో పనికొచ్చే ఆవిష్కరణను చేసింది. అమెరికాకు చెందిన 3M అనే సంస్థ నిర్వహించిన యంగ్ సైంటిస్ట్ చాలెంజ్‌లో తన ఇన్నోవేషన్‌తో విజేతగా నిలిచింది అనిక చేబ్రోలు. 14ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఎనిమిదో తరగతి చదువుతోంది.

సీజనల్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజాలకు శాశ్వత చికిత్స కనిపెట్టాలన్న లక్ష్యంతో పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్న అనిక.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టింది. ‘కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దానికి ఉండే స్పైక్స్ లాంటి ప్రొటీన్ కొమ్ముల సాయంతో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, అందులోని సెల్స్‌ని మొత్తం కరోనా వైరస్‌గా మార్చేస్తోంది. ఈ స్పైక్స్ వంటి భాగాన్ని బంధించి బ్రేక్ చేస్తే.. వైరస్ ఇతర సెల్స్‌లో దాని ప్రొటీన్ ఫంక్షనింగ్ చేయకుండా అడ్డుకోవచ్చు. ఇలా చేయగలిగితే కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినా ఏమీ చేయలేదు’ అని అనిక చెబుతోంది. ఆ ప్రొటీన్ స్పైక్స్‌ను బంధించే అణువులను తన కంప్యూటర్ బేస్డ్ స్టిమ్యులేషన్ రీసెర్చ్‌లో గుర్తించామని అనిక తెలిపింది. అనిక చేసిన ఈ రీసెర్చ్‌కు యంగ్ సైంటిస్ట్ చాలెంజ్‌లో టాప్ ప్రైజ్ వచ్చింది. ఆమెకు 3M సంస్థ 25 వేల డాలర్ల (రూ.18,33,000) ఫ్రైజ్‌ను అందించింది. తనకు పరిశోధనలపై ఆసక్తి కలగడానికి కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన తన తాతయ్య కారణమని, తన చిన్నప్పటి నుంచి సైన్స్‌పై ఇంట్రెస్ట్ పెంచారని అనిక తెలిపింది. తాను పెద్దయ్యాక మెడికల్ రీసెర్చ్‌ని కెరీర్‌గా ఎంచుకుంటానని చెబుతోంది.