మెన్స్ మారథాన్‌లో ఇండియా అథ్లెట్ సావన్ బర్వాల్ రజత పతకంతో సంచలనం సృష్టించాడు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సావన్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేసి రెండో ప్లేస్‌లో నిలిచాడు. ఈ క్రమంలో తన పేరుమీద ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టాడు. జపాన్ రన్నర్ ఇచితాక యమషిత (2:10:49) స్వర్ణం గెలవగా, చైనా అథ్లెట్ పెయియు ఫెంగ్ (2:12:13) కాంస్యం దక్కించుకున్నాడు.
ఆసియా క్రీడల మారథాన్ విభాగంలో ఇండియాకు పతకం దక్కడం 1982 తర్వాత ఇదే తొలిసారి. ఢిల్లీ వేదికగా జరిగిన 1982 ఆసియా క్రీడల్లో హోసూర్ కుక్కప్ప సీతారాం కాంస్యం గెలుపొందగా, మళ్లీ ఇప్పుడు సావన్ రజతంతో ఆ లోటును పూడ్చాడు.
ఆసియా క్రీడల మారథాన్‌లో పతకం సాధించిన నాలుగో ఇండియన్ అథ్లెట్‌గా సావన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు చోటా సింగ్, సూరత్ సింగ్ మాథుర్ 1951 తొలి ఆసియా క్రీడల్లో పతకాలు సాధించారు. ఇండియాకే చెందిన కార్తీక్ కర్కేర 2:22:41 సెకన్ల టైమింగ్‌తో 17వ స్థానంలో నిలిచాడు. మరోవైపు మెన్స్ షాట్‌పుట్‌లో స్టార్ అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఫైనల్లో తూర్ ఇనుప గుండును 20.64 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు.
కాంటినెంటల్ క్రీడల్లో తూర్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. గత రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన తూర్, ఈసారి రజతంతో సరిపెట్టాల్సి వచ్చింది. విమెన్స్ 400 మీటర్ల ఫైనల్లో ప్రాచీ చౌదరి 53.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం గెలుచుకుంది.
