ఆసియా కప్ 2023 ఫుట్బాల్ టోర్నీకి టీమిండియా అర్హత

ఆసియా కప్ 2023 ఫుట్బాల్ టోర్నీకి టీమిండియా అర్హత

వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి ఇండియన్ టీమ్ అర్హత సాధించింది. ఆసియా కప్ 2023 గ్రూప్ డీ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫిలిప్పిన్పై  పాలస్తీనా 4-0 స్కోరు తేడాతో విజయం సాధించడంతో టీమిండియాకు మార్గం సుగమమైంది. ఈ టోర్నీలో భాగంగా హంగ్‌కాంగ్‌తో జరిగే  మ్యాచ్‌కి ముందే భారత ఫుట్‌బాల్ జట్టు, ఆసియా కప్ 2023 టోర్నీకి అర్హత సాధించడం విశేషం. హంగ్‌కాంగ్‌తో జరిగే మ్యాచ్‌లో  భారత్ ఓడిపోయినా..గ్రూప్ డిలో  6 పాయింట్లతో రెండో స్థానంలో నిలవనుంది. ఇక భారత్ జట్టు వరుసగా రెండోసారి ఆసియా కప్ కు అర్హత సాధించడం గమనార్హం.

కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతున్న  ఆసియా కప్ 2023  గ్రూప్ డీ క్వాలిఫైయర్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు కొలంబియాను మట్టికరిపించింది.  2-0 తేడాతో కొలంబియాను ఓడించింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచింది. దీంతో టాప్-2 స్థానంలో నిలిచింది. 

ఆసియా కప్ 1956లో ఆరంభమైనప్పటికీ.. భారత జట్టు ఇప్పటిదాకా ఐదు సార్లు మాత్రమే టోర్నీకి అర్హత సాధించింది. మొదటి సారిగా 1964లో ఫుట్‌బాల్ కప్ లో ఆడింది. ఆ టోర్నీలో ఫైనల్ చేరిన టీమిండియా..ఇజ్రాయిల్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 1984లో మళ్లీ ఆసియా కప్‌ టోర్నీలో పాల్గొంది.  1984లో గ్రూప్ స్టేజీకి మాత్రమే పరిమితమైంది.   ఆసియా కప్ 2011లోనూ ఆడిన ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ 16వ స్థానంలో నిలవగా.... 2019లో 17వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం2023 సీజన్ కు అర్హత సాధించి.. బరిలో దిగబోతోంది. వచ్చే ఏడాది జూన్ 16 నుంచి జులై 16 వరకు చైనాలో ఆసియా కప్ జరగనుంది.