పాలిటీపై పట్టు సాధిద్దాం

పాలిటీపై పట్టు సాధిద్దాం

పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగంలో ఇండియన్  పాలిటీపరంగా అడిగే ప్రశ్నల సరళిని చూస్తే ప్రాధాన్యం పెరుగుతోంది. వర్తమాన రాజకీయాంశాలు, సంఘటనలను రాజ్యాంగపరంగా పరిశీలిస్తూ అధ్యయనం చేస్తే పాలిటీ విభాగంలో అడిగే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు. గతంలో పాలిటీ నుంచి వచ్చే ప్రశ్నల్లో ఎక్కువగా విషయ పరిజ్ఞానానికి సంబంధించినవిగా ఉండేవి. కానీ ప్రస్తుత పరీక్షల్లో మాత్రం ప్రశ్నల తీరులో స్పష్టమైన మార్పు, వైవిధ్యం కనిపిస్తోంది. విశ్లేషణ సామర్థ్యంతోపాటు తులనాత్మకతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగార్థుల జ్ఞాపకశక్తిని పరీక్షించే ప్రశ్నలు కాకుండా వారి విశ్లేషణాత్మక సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజకీయ సంఘటనలు, వాటితో సంబంధం ఉన్న ప్రముఖ రాజకీయ సంస్థలు, వ్యక్తులను అనుసంధానం చేస్తూ అధ్యయనం చేస్తే ఫలితం ఉంటుంది. చారిత్రకంగా రాజకీయ విశ్లేషణ చేయగలిగితే అభ్యర్థులు ఈ తరహా ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించగలుగుతారు.

అధ్యయనం చేయాల్సిన అంశాలు
రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా - రాజ్యాంగ పరిషత్ చారిత్రక నేపథ్యం, చార్టర్ చట్టాలు, రాజ్యాంగ రచన, ముఖ్యమైన కమిటీలు; ప్రముఖ సభ్యులు - వారి కృషి, రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, పౌరసత్వం,రాజ్యాంగ మౌలిక స్వరూపం తదితర అంశాలపై దృష్టి సారించాలి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం - రాష్ట్రపతి ఎన్నిక, తొలగింపు, అధికారాలు; మంత్రి మండలి; సంకీర్ణ వ్యవస్థలో బలహీనపడుతున్న ప్రధానమంత్రి వ్యవస్థ; భారత ప్రభుత్వ వ్యవస్థ - పార్లమెంట్ నిర్మాణం; లోక్‌‌సభ విశేష అధికారాలు; రాజ్యసభ ప్రత్యేక అధికారాలు; పార్లమెంటు - శాసన, రాజ్యాంగ, విచారణ,  విధులు; కార్యనిర్వాహక వర్గాన్ని జవాబుదారీతనం చేయడంలో దాని క్షీణత; విప్‌‌ల జారీ; పార్టీ ఫిరాయింపుల చట్టం; స్పీకర్ పాత్ర; నేరమయ రాజకీయాలు; న్యాయ వ్యవస్థ నిర్మాణం; సుప్రీంకోర్టు క్రియాశీలత అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి.

 • రాజ్యాంగబద్ధ సంస్థలు: - భారత ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్థిక సంఘం, యూనియన్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, వాటి విధులు తదితర అంశాలపై దృష్టి సారించాలి.
 • రాష్ట్ర ప్రభుత్వం: గవర్నర్, మంత్రి మండలి, విధాన సభ, విధాన పరిషత్, హైకోర్టు, ఆధీన న్యాయస్థానాలు, ఈ విభాగం కింద ఆయా రాష్ట్రాల అవతరణ, అతి తక్కువ, అతి ఎక్కువ స్థానాలున్న అసెంబ్లీ, విధాన పరిషత్‌‌ల ఏర్పాటు - రద్దు, ఉభయ సభల అధికారాలు, గవర్నర్‌‌కు ఉన్న ప్రత్యేక అధికారాలను అధ్యయనం చేయాలి.
 • కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సమగ్ర అవగాహన:శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు, అంతర్ రాష్ట్ర మండలి, సర్కారియా కమిషన్, ఫూంచీ కమిషన్ - వాటి సిఫార్సులను అధ్యయనం చేయాలి.
 • ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రాధాన్యత, వాటి మధ్య ఘర్షణ, వాటికి సంబంధించి రాజ్యాంగ సవరణలు, ప్రధానమైన కోర్టు తీర్పులపై అవగాహన ఏర్పరచుకోవాలి. 
 • స్థానిక స్వపరిపాలన: మేయో, రిప్పన్ తీర్మానాలు, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, హనుమంతరావు కమిటీ, జీవీకేరావు కమిటీ, సింఘ్వీ కమిటీలు - వాటి సిఫార్సులు, 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(తెలంగాణ)పంచాయతీరాజ్ చట్టం, మున్సిపాల్టీల చట్టం, కార్పొరేషన్లు తదితర అంశాలు. 
 • ఇతర రాజ్యాంగేతర సంస్థలు: నీతి ఆయోగ్ నిర్మాణం, ప్రత్యేక విభాగాలు, లక్ష్యాలు, విధులు, జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు. మహిళా కమిషన్, అల్ప సంఖ్యాక, వెనుకబడిన తరగతుల కమిషన్లు, షెడ్యూల్డ్ కులాలు, తెగల కమిషన్లు, ప్రణాళిక సంఘం, జాతీయాభివృద్ధి మండలి, ప్రాంతీయ మండళ్లు గురించి సమాచారంపై విస్తృత అవగాహన అవసరం.
 • ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు: ముఖ్యమైన రాజ్యాంగ సవరణలపై అవగాహన పెంపొందించుకోవాలి. వీటితోపాటు ఎన్నికల సంస్కరణలు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), లోక్‌‌పాల్, లోకాయుక్త వంటి ఇతర అంశాలపై పూర్తి సన్నద్ధతను కలిగి ఉండాలి.
 • రాజకీయ క్రియాశీలత: - రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల పాత్ర, ఎన్నికలు, ఎన్నికల చట్టాలు, ఎన్నికల సంస్కరణలు, ఓటింగ్ ప్రవర్తన, సంకీర్ణ ప్రభుత్వం, విదేశాంగ విధానం, జాతీయ సమగ్రత, ప్రభావ వర్గాలు లాంటి అంశాలపై కూడా అవగాహన పొందితే అదనపు ప్రయోజనం ఉంటుంది.
 • వీటితోపాటు కరెంట్ పాలిటీని సబ్జెక్ట్ తో అన్వయించుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. పాలిటీలోని ప్రతి విభాగంపై పట్టు సాధించాలంటే 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు అకడమిక్ పాఠ్య పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి.
 • ఏ పుస్తకాలు ఉపయుక్తమైనవి: అప్ టూ డిగ్రీ వరకు అకడమిక్ పుస్తకాలు, తెలుగు అకాడమీ ప్రచురించిన పోటీ పరీక్షల ప్రత్యేకం - భారత రాజ్యాంగం అనే పుస్తకం.


పౌరసత్వం....

రాజ్యాంగంలో 2వ భాగంలో పౌరసత్వాన్ని 5 నుంచి 11 అధికరణల్లో పొందుపర్చారు.

 •  5వ అధికరణం రాజ్యాంగం అమలులోనికి వచ్చే సమయానికి ఉన్న పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో జన్మించిన వారికి, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరైన భారత పౌరులైన వారికి, భారత భూ భాగంలో ఐదేళ్ల పూర్వం నుంచి నివసిస్తున్న వారందరికి.
 • 6వ అధికరణం ప్రకారం పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన వారికి ఇచ్చే భారతీయ పౌరసత్వం.
 • 7వ అధికరణం ప్రకారం 1947వ సంవత్సరం తర్వాత పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన వారికి భారతీయ పౌరసత్వం ఇవ్వబడదు.
 • 8వ అధికరణం ప్రకారం భారతదేశానికి చెందినవారు ఇతర దేశాల్లో జీవించే వారికి పౌరసత్వం ఇచ్చే నియమాలను తెలుపుతుంది.
 •  9వ అధికరణం ప్రకారం చట్ట ప్రకారం పౌరసత్వం పొందిన వారికి భారత పౌరసత్వం హక్కులు లభిస్తాయి.
 • 11వ అధికరణం ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన అంశాలను పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది. రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు ఏక పౌరసత్వం కలదు. 1955వ సంవత్సరంలో భారతీయ పౌరసత్వ చట్టాన్ని రూపొందించారు. దీన్ని 1986లో సవరించారు. సహజ పౌరసత్వం అంటే 1950 జనవరి 26 తర్వాత భారతదేశంలో పుట్టిన వారందరూ భారత పౌరులు అవుతారు. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వం అయిదు విధాలుగా లభిస్తుంది.

1.జన్మతః పౌరసత్వం, 2.రక్త సంబంధిత పౌరసత్వం, 3.రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా పౌరసత్వం, 4. సహజీకృత పౌరసత్వం,5. ఒక ప్రాంతాన్ని ఆక్రమించుట ద్వారా అక్కడ లభించే పౌరసత్వం.

1986 పౌరసత్వం సవరణ చట్టం ప్రకారం భారతదేశంలో ఐదేళ్లు నివసించిన వారికి రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం లభిస్తుంది. భారత రాజ్యాంగం పట్ల వంచనతో భారతదేశ పౌరసత్వాన్ని సంపాదించాడని రుజువైనప్పుడు అతని పౌరసత్వాన్ని రద్దుచేస్తారు.  ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ సిఫారసు ప్రకారం ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించారు. 1961లో గోవా భారతదేశ భూభాగంలో చేర్చడం వల్ల గోవా రాష్ట్ర ప్రజలకు ప్రాదేశిక పౌరసత్వం కల్పించారు. 2005లో పౌరసత్వ సవరణ చట్టం చేశారు. ప్రవాస భారతీయుల సమావేశాలు 2003 - న్యూఢిల్లీ, 2004– న్యూఢిల్లీ, 2005 - హైదరాబాద్, 2006 - హైదరాబాద్, 2007,2008ల్లో న్యూఢిల్లీలో జరిగాయి. 2005లో నివృత్తిరాయ్, మహమ్మద్ ఇఫ్టీకార్ షరీఫ్ కు ద్వంద్వ పౌరసత్వం కార్డులిచ్చారు.

బి.ఎన్. రావు, నాలెడ్జ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, మిర్యాలగూడ​