
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 19,20 తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఇదే ట్రాక్‌పై ఫార్ములా-–-ఈ రేసింగ్ జరగనుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ గా ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు. ట్రాక్ ను రియల్ టైమ్ లో సేఫ్టీ అండ్ రెడీ నేస్ టెస్ట్ చేసేలా ఈ రెండ్రోజులు లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్ రేస్ కోసం ఇప్పటికే విదేశాల నుంచి రేసర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
డిసెంబర్ 10, 11 తేదీల్లో మరోసారి రెండో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ ఏర్పాటు చేసిన 2.7- కిలోమీటర్ల సర్క్యూట్ లో ఈ రేసింగ్ జరగనుంది. విద్యుత్ ఆధారంగా నడిచే సింగిల్ సీటర్ కారును ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం వినియోగిస్తున్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లతో ఫార్ములా రేసింగ్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం లండన్, న్యూయార్క్, రోమ్, బెర్లిన్, సియోల్ లో మాత్రమే ఫార్ములా-–ఈ రేసింగ్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు వాటి సరసన హైదరాబాద్ నగరం కూడా చేరింది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తోంది. హుస్సేన్ సాగర్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్, సంజీవయ్య పార్క్ మీదుగా ఈ ట్రాక్ నిర్మించారు. ఫార్ములా – ఈ కార్ రేసింగ్ హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగనుంది. రేస్ నడుస్తున్న సమయంలో పిట్‌స్టాప్స్, ప్రేక్షకుల కోసం సీటింగ్, ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టారు.