250 శాతం పెరిగిన రెవెన్యూ

250 శాతం పెరిగిన రెవెన్యూ
  • రూ.246 కోట్లుగా రికార్డు
  • 250 శాతం పెరిగిన రెవెన్యూ

న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన మొదటి క్వార్టర్​లో అద్భుత ఫలితాలను సాధించింది. ఈసారి నికర లాభం 198శాతం పెరిగి రూ.245.52 కోట్లకు చేరుకుంది. ఇది పోయిన ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో 82.52 కోట్ల లాభాన్ని సంపాదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 250.34 శాతం పెరిగి  రూ.243.36 కోట్ల నుండి రూ.852.59 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం రూ.258 కోట్ల నుంచి రూ.877 కోట్లకు పెరిగింది.   మొత్తం ఖర్చులు సంవత్సరానికి రూ.147 కోట్ల నుండి రూ.548 కోట్లకు ఎగిశాయి. వడ్డీ, పన్నులు, తరుగుదల అప్పులకు ముందు ఆదాయాలు (ఇబిటా) ప్రస్తుత జూన్​ క్వార్టర్​లో రూ.320.9 కోట్లు ఉండగా,  2022 ఆర్థిక సంవత్సరం జూన్​ క్వార్టర్​లో రూ.111.5 కోట్లు ఉంది. సెగ్మెంట్ వారీగా చూస్తే, ఐఆర్​సీటీసీ  మొత్తం ఐదు వ్యాపారాలు గ్రోత్​ను సాధించాయి.  క్యాటరింగ్ సేవల వ్యాపార ఆదాయం సంవత్సరానికి రూ.56.7 కోట్ల నుండి రూ.352 కోట్లకు పెరిగింది.

ఇంటర్నెట్ టికెటింగ్ వ్యాపారం నుంచి రూ.301.6 కోట్లు, రైల్ నీర్ రూ.83.6 కోట్లు, టూరిజం రూ.81.9 కోట్లు,  స్టేట్ తీర్థ సెగ్మెంట్​ నుంచి రూ.33.2 కోట్ల ఆదాయం వచ్చింది.  2020 మార్చికి ముందు ఇచ్చిన కాంట్రాక్టులను కరోనా మహమ్మారి కారణంగా జీరో పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణించామని ఐఆర్​సీటీసీ తెలిపింది.  దీని ప్రకారం 2020–-21 సంవత్సరంలో  26.11.2021 వరకు చెల్లించాల్సిన ఆదాయంతో పాటు రైల్వే వాటా కూడా జమ కాలేదని కంపెనీ తెలిపింది. గత నవంబరు నుంచి క్యాటరింగ్ సేవలు తిరిగి మొదలయ్యాయి. తదనుగుణంగా చెల్లించాల్సిన ఆదాయం  రైల్వే నుంచి వచ్చింది. ఫలితాల నేపథ్యంలో  బీఎస్​ఈలో బుధవారం కంపెనీ స్క్రిప్ 2.41శాతం పెరిగి రూ.673.10 వద్ద ముగిసింది.