నూతన యుగం ప్రవక్త

నూతన యుగం ప్రవక్త

నాస్తికోద్యమం.. స్వాభిమాన పోరాటం.. మహిళా అభ్యుదయం.. కులరహిత సమాజం.. సామాజిక సమానత్వం.. వీటి కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే గొంతెత్తిన గొప్ప యోధుడు పెరియార్​ ఇ.వి. రామస్వామి. బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిబాపూలే గురించి తెలిసినంతగా పెరియార్​ గురించి చాలా మందికి తెలియదు. దక్షిణాదిలో ఒకవైపు బ్రిటిష్ పాలకులను ఎదిరిస్తూనే.. మరోవైపు ఆధిపత్య కులాల నుంచి దళిత బహుజనుల విముక్తి కోసం, మహిళల స్వాభిమానం కోసం, సామాజిక సమానత్వం కోసం పెరియార్ తీవ్రంగా కృషి చేశారు. ఏ వ్యవస్థ అయినా పీడిత ప్రజల్ని ఎంత అవమానించి, హింసించి, అణచివేస్తుందో అంతగా ఆ వ్యవస్థ పట్ల కోపాన్ని, ద్వేషాన్ని, కసిని పెంచుకోనిదే పీడితులకు ఎన్నడూ, ఎక్కడా న్యాయం జరగలేదని చెప్పడమే కాదు.. వారిలో సామాజిక స్ఫూర్తిని, ప్రేరణను రగిలించిన సమరశీలి పెరియార్​ రామస్వామి. 

జనం పెట్టిన పేరు
మహిళా సమానత్వం, చైతన్యం కోసం చేసిన పోరాటమే ఆయనకు పెరియార్​ అనే పేరు తెచ్చిపెట్టాయి. 1938 నవంబర్ 12న మద్రాస్​లో ఐదు వేల మంది మహిళలు నల్ల చీరలు కట్టుకుని రామస్వామిని పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్లి సభ పెట్టి ‘‘పెరియార్ వర్థిల్లాలి’’ అని నినాదాలు చేశారు. ఆ రోజు నుంచి 
ఇ.వి.రామస్వామిని పెరియార్(మహాత్మ, గొప్పవారు)గా పిలవాలని తీర్మానించారు. పెరియార్ నిరాడంబర, నిస్వార్థ సేవలను గుర్తించిన యునైటెడ్​ నేషన్స్​‘‘నూతన యుగం ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీస్, సంఘ సంస్కరణోద్యమానికి పితామహుడు, అజ్ఞానానికి, మూఢనమ్మకాలకు, అర్ధరహిత సంప్రదాయాలకు, ఆధారం లేని ఆచారాలకు బద్ధ శత్రువు" అని ప్రశంసించింది. తమిళనాడులోని ఈరోడ్​ పట్టణంలో 1879 సెప్టెంబర్​ 17న పెరియార్​ పుట్టారు. ఆయన పూర్తి పేరు ఈరోడ్​ వెంకటప్ప రామస్వామి. సంపన్న కుటుంబంలో పుట్టి విలాసవంతమైన జీవనం గడిపే అవకాశమున్నా.. అణగారిన ప్రజలు, మహిళల కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం, సమసమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరాటం చేశారు. దళితులు, పీడిత జనుల కోసం జీవితకాలం ఉద్యమాలు చేశారు. మనిషికి మనిషికి మధ్య అసమానతలను పెంచే కులాన్ని నిర్మూలించాలని కుల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. మనుషుల మధ్య అసమానతలకు, అణచివేతలకు, అవమానాలకు కులం ఎలా కారణమైందో పరిశోధనాత్మకంగా వివరించడమే కాకుండా.. వాటి నుంచి బయటపడడానికి ఆచరణాత్మక ఉద్యమం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి కులం ఎలా అడ్డుపడుతుందో తన పోరాటాల ద్వారా తెలియజెప్పారు.

కులాలు అంతమైనప్పుడే..
ఒక జాతి, ఒక వర్గం వెనుకబాటుతనానికి అగ్రకులాల అణచివేతతోపాటు ఆ జాతి ప్రజల్లో ఉన్న బానిస లక్షణం కూడా కారణమన్నది పెరియార్​ నమ్మిన మాట. అగ్ర కులాలపై ఉద్యమిస్తూనే బహుజనుల చైతన్యం కోసం నాస్తికత్వాన్ని ఆయుధంగా చేసుకొని పోరాటం చేశారు. గాంధీకి చరిత్ర అధ్యయనం లేదని, ఆయన సామాజిక దృక్పధం లేని పామరుడని పెరియార్​ వర్ణించారు. గాంధీ మద్దతిస్తున్న వర్ణ వ్యవస్థను ధ్వంసం చేయకుండా బహుజనులకు విముక్తి జరగదన్నారు. ఆ వర్ణ వ్యవస్థకు మూలమైన కులాలు అంతమైనప్పుడే పీడిత ప్రజలు మానసిక బానిస సంకెళ్లను తెంచుకోగలరని బోధించారు. అంటరానితనాన్ని పాటించిన ప్రముఖ దేశభక్తులందరినీ ప్రశ్నించిన ధైర్యశాలి. దళిత హక్కుల కోసం పోరాడుతున్న అంబేడ్కర్ కు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్షకు పూనుకోవడాన్ని వ్యతిరేకించిన పెరియార్.. గాంధీని జీవితాంతం దళితుల పాలిట శత్రువుగా భావించారు.

మహిళల కోసం స్వాభిమాన ఉద్యమం
కాంగ్రెస్ విధానాలతో విసుగు చెందిన పెరియార్ బయటకు వచ్చి స్వాభిమాన ఉద్యమం ప్రారంభించారు. దళితులు, మహిళలను పాత్రధారులను చేసి వేలల్లో కులాంతర వివాహాలు జరిపించారు. స్వాభిమాన ఉద్యమం విజయం సాధించాలంటే మహిళ పాత్ర కీలకమని గుర్తించిన పెరియార్ సమాజంలో సగభాగమైన మహిళలకు అంతే స్థాయిలో అవకాశాలు ఉండాలని మత విశ్వాసాలు, దైవభావాలు, పురుషాహంకారంపై వారిని చైతన్యవంతులను చేశారు. మహిళలు మానసిక బానిసత్వాన్ని వీడిన నాడే సమానత్వాన్ని సాధిస్తారని ఆచరణాత్మక ఉద్యమం చేశారు. ‘‘మహిళలకు మగవారి నుంచి ఎన్నటికీ స్వాతంత్ర్యం దొరకబోదు. మగవాడు లేకుండా ఆడది బతకలేదని ప్రతి మహిళా అనుకుంటోంది. అదే సమయంలో ఆడది లేకుండా మగవాడు జీవించగలడని అనుకుంటోంది. తరతరాలుగా ఇలాంటి బానిస భావాలు లోతుగా పాతుకుపోయిన వ్యవస్థలో పెరిగిన మహిళలు తమ సంకెళ్లను తామే తెంచుకోవాలి”అని పెరియార్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను వ్యతిరేకించి, వితంతు వివాహాలను ప్రోత్సహించిన పెరియార్ హిందూ పురోహిత పెళ్లిళ్ల వల్ల సమాజంలో మహిళలు అవమానాలకు గురవుతున్నారని, దానికి ప్రత్యామ్నాయంగా ‘‘దండల పెళ్లి(స్వాభిమాన పెళ్లి)’’ని ప్రారంభించారు. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వంతో పాటు విద్యా, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేశారు. మగవారు స్వేచ్ఛగా ఉండాలంటే మహిళలకు స్వేచ్ఛను ఇవ్వాలని, పురుషులకున్నంత స్వేచ్ఛ ఆడవారికి కల్పించాలని వాదించారు. ‘‘ఒక కుటుంబంలో నలుగురు ఉంటే, వారిలో ఒక్కరే చదువుకునే వీలుంటే ఆ కుటుంబంలో ఉన్న మగాళ్లను ఆపి ఒక్కగానొక్క కూతురు చదువుకునేందుకు అవకాశం కల్పించాలి”అంటూ బాలికా విద్య ప్రాధాన్యతను చాటిచెప్పారు.

రిజర్వేషన్ల కోసం పోరాటం
స్వాతంత్ర్యాన్ని ‘‘విషాద దినం’’గా అభివర్ణించిన పెరియార్.. దేశ ప్రజలకు వెండి సంకెళ్లు పోయి బంగారు సంకెళ్లు పడ్డాయని అన్నారు. మనం రాసుకున్న రాజ్యాంగం పీడిత కులాలకు న్యాయం చేకూర్చదని గొంతెత్తారు. గతం నుంచి కొనసాగుతున్న రిజర్వేషన్లు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చెల్లవన్న కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమించి తొలి రాజ్యాంగ సవరణ చేయించి రిజర్వేషన్లను కాపాడారు. పెరియార్ ఉద్యమం వల్ల తమిళనాడులో ఆనాటి నుంచి నేటి వరకు బహుజనులు రాజ్యమేలడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్య, ఉద్యోగాల్లో 67 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. పెరియార్ ఉద్యమ కృషి ఫలితంగానే 1967లో తమిళనాడులో బహుజన రాజ్యం ఏర్పడింది. స్వాభిమాన పెళ్లి చట్టం అమలు జరిగింది. ‘‘దేవుడు లేడు - లేనే లేడు’’ అని తమిళనాడు అంతటా రాయించి సభల ముందు ఈ నినాదాన్ని వివరించే సంప్రదాయం పెట్టారు. దీన్ని బట్టి బహుజనుల విముక్తి కోసం పెరియార్ ఎంత బలమైన ఉద్యమం చేశారో అర్థమవుతుంది. 

ఆ స్ఫూర్తి కొనసాగాలె
పెరియార్ సాంస్కృతిక విప్లవం, సామాజిక సందేశం దక్షిణ భారతంలోని తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ జాతీయులందరికీ ఉద్దేశించినది. ఆయన మాటలు, రాతలూ అక్షరాల్లో ముద్రించగలిగితే కనీసం 50 పెద్ద సంపుటాలవుతాయి. 94 సంవత్సరాల 3 నెలల 7 రోజుల జీవితకాలంలో ప్రచార కార్యక్రమాల కోసం 8,20,000 మైళ్లు ప్రయాణించారు. మొత్తం 10,700 సభలు, సమావేశాల్లో ప్రసంగించారు. ఆయన ప్రసంగాలను క్యాసెట్లలో రికార్డు చేసి విడవకుండా వినిపిస్తే 2 సంవత్సరాల 5 నెలల 11 రోజులు పడుతుంది. వివిధ సందర్భాల్లో 10 సంవత్సరాల జైలు జీవితం అనుభవించారు. 1973 డిసెంబర్ 24న కన్నుమూశారు. పెరియార్ ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ జనాభాల లెక్కల సేకరణ, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. 21వ శతాబ్దంలో జీవిస్తున్న మనం సామాజిక చైతన్యం, సామాజిక న్యాయం కోసం ఒక అడుగు ముందుకేసి తెగించి లక్ష్యాన్ని సాధించాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు దాటినా కొన్ని కులాలే ఇప్పటికీ అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను శాసిస్తూ బహుజనులను ఎలా పీడించి పిప్పి చేస్తున్నాయో గుర్తించాలి. పెరియార్ ఆలోచనా విధానం, సిద్ధాంతాలు మనకు ఆదర్శం కావాలి. అనన్య సామాన్యమైన రీతిలో ఆయన సాగించిన సాంస్కృతిక విప్లవం పీడిత ప్రజలను చైతన్యపరిచింది. పెరియార్​ జీవితమే పీడిత జాతికి ఒక సందేశాన్నిస్తుంది. స్ఫూర్తినిస్తుంది.  

తొలి మానవ హక్కుల  పోరాటం.. వైక్కోమ్
కేరళలోని కొట్టాయం జిల్లా వైక్కోమ్ అనే పట్టణంలోని పురాతన శివాలయం ముందు నాలుగు వీధుల గుండా అంటరాని కులాల వారు నడవకూడదని నిషేధం పెట్టారు. దానిని ఎత్తేయాలని కేరళలోని సంఘ సేవకులు సత్యాగ్రహం మొదలుపెట్టగా.. అందులో పాల్గొన్న నాయకులందరినీ ప్రభుత్వం చెరసాలలో వేసింది. ప్రజల కోరిక మేరకు కేరళ వెళ్లిన పెరియార్.. సత్యాగ్రహం కొనసాగించారు. దానికి దేశవ్యాప్త మద్దతు లభించింది. పెరియార్ పట్టుదలను చూసిన అక్కడి పాలకులు సత్యాగ్రహంలో జోక్యం చేసుకోవాలని గాంధీని కోరారు. 1925 మార్చి 9న వైక్కోమ్ చేరుకున్న గాంధీ.. పెరియార్ ను కలిసి సత్యాగ్రహాన్ని వీడాలని కోరారు. దానికి పెరియార్ ‘‘సత్యాగ్రహాన్ని నిలిపేయమంటున్నారు సరే వైక్కతప్పన్ వీధిలో కుక్కలు, పందులు, పశువులు, గాడిదలు నడుస్తాయి. ఇవన్నీ సత్యాగ్రహం చేసే హక్కుల్ని సాధించుకున్నాయా? సాటి మనుషులు వీధుల్లో నడవడానికి సత్యాగ్రహం చేస్తుంటే విరమించుకోమంటున్నారు. బాగుందా?”అని ప్రశ్నించారు. చివరికి వైక్కోమ్ వీధుల గుండా శూద్రులు నడిచే హక్కు సాధించే వరకూ పెరియార్​ సత్యాగ్రహాన్ని వీడలేదు.

- సాయిని నరేందర్, సోషల్​ ఎనలిస్ట్