రెండో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 6 నెలల కిందకు పడిపోయిన సూచీలు

రెండో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 6 నెలల కిందకు పడిపోయిన సూచీలు

భారత స్టాక్ మార్కెట్ సూచీలు తమ నష్టాల ప్రయాణాన్ని ఈవారం రెండవరోజూ కొనసాగిస్తున్నాయి. సోమవారం నష్టాలకు మంగళవారం కూడా తోడుకావటంతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు 6నెలల కనిష్ఠాలకు పడిపోయాయి. ఈ క్రమంలో ఉదయం 10.36 గంటల సమయంలో సెన్సెక్స్ 622 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 190 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 605 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 569 పాయింట్లు పతనం అయ్యాయి. 

మార్కెట్ల నేలచూపులకు కారణాలు..

1. పెరిగిన బ్రెంట్ క్రూడ్:
ప్రపంచ చమురు మార్కెట్లో బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర 1.74 శాతం పెరిగి బ్యారెల్‌కు 107.1 డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారైన భారత్‌కు ఇది తీవ్ర ప్రతికూల పరిణామం. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా.. దిగుమతి బిల్లును భారంగా మారుస్తుంది. దీనివల్ల దేశ ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ కంపెనీల లాభాలు తగ్గిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2. FII అమ్మకాలు:
విదేశీ సంస్థాగత మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 28 నాటికి వరుసగా మూడో సెషన్‌లోనూ ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఒక్కరోజే రూ.5వేల 300 కోట్లకు పైగా విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ విదేశీ నిధుల ఔట్ ఫ్లో స్టాక్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

3. ప్రతికూల గ్లోబల్ సంకేతాలు:
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, జపాన్ నిక్కీ 225, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. సోమవారం అమెరికా మార్కెట్లు కూడా నష్టాలతో ముగిశాయి. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ పడిపోవడం, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 0.5 శాతం వరకు క్షీణించడం వంటివి అమెరికా మార్కెట్లకు కూడా బలహీనమైన ప్రారంభాన్ని సూచిస్తున్నాయి.

4. డాలర్‌తో పోలిస్తే పడిపోయిన రూపాయి:
అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావంతో రూపాయి మారకం విలువ మరింత బలహీనపడింది. రూపాయి విలువ ఏకంగా 16 పైసలు పడిపోయి, చారిత్రాత్మకంగా కీలకమైన 96 రూపాయల స్థాయిని దాటింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.03 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత 96.13కి పడిపోయింది. దీనివల్ల రానున్న కాలంలో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5. పెరిగిన ఇండియా విక్స్:
మార్కెట్ అస్థిరతను సూచించే 'ఇండియా విక్స్' ఏకంగా 6 శాతం పెరిగి 14.44 స్థాయికి చేరింది. ఇది మార్కెట్‌లో అనిశ్చితిని, రాబోయే రోజుల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే అవకాశాన్ని సూచిస్తుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.