Markets Crash: నష్టాల సునామీలో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్..

Markets Crash: నష్టాల సునామీలో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్..

Trump Tariffs: ప్రపంచ పెద్దన అమెరికా భారత్ తన స్నేహితుడు అంటూనే ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం స్టార్ట్ అయ్యింది. ట్రంప్ టారిఫ్స్ తో పాటు కొన్ని భారతీయ కంపెనీలపై శాంక్షన్స్ విధించటం తీవ్రతను తెలియజేస్తోంది. 

అమెరికా టారిఫ్స్ ప్రకటనతో నేడు నష్టాలతో స్టార్ట్ అయిన బెంచ్ మార్క్ సూచీలు సమయం గడిచేకొద్ది నష్టాలను పెంచుకుంటున్నాయి. ప్రధానంగా మార్కెట్లో పెరిగిన భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటం నష్టాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఉదయం 10.39 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 615 పాయింట్లు, నిఫ్టీ సూచీ 180 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 540 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 790 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతున్నాయి. 

* మెుదటగా రష్యా నుంచి ఆయుధాలు, క్రూడ్ కొనుగోళ్లపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఇండియాపై 25 శాతం సుంకాన్ని ప్రకటించటం ఆందోళనలను ప్రేరేపించింది. ఇది భారత జీడీపీని తగ్గిస్తుందని జియోజిత్ నిపుణులు వికే విజయ్ కుమార్ చెప్పారు. ఒకపక్క వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా మరోపక్క టారిఫ్స్ ప్రకటన ఒత్తిడిని పెంచే ప్రయత్నంగా నిపుణులు చెబుతున్నారు. 

* ఇక మార్కెట్లను ప్రభావితం చేస్తున్న రెండవ అంశం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకోవటమే. బుధవారం కూడా విదేశీ మదుపరులు రూ.850కోట్ల విలువైన పెట్టుబడులను విక్రయించారు. ఇది మార్కెట్లను కిందికి నెట్టేస్తోందని ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను దెబ్బతీస్తోందని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. 

* భారత మార్కెట్లను ప్రభావితం చేస్తున్న మరో అంశం ఆసియా మార్కె్ట్లు నష్టాల్లో కొనసాగటమే. చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా మార్కెట్లు నష్టాల్లో ఉండగా.. అమెరికా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ముగిశాయి. ఈ పరిస్థితులు కూడా ఇండియాలోని ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తోందని తెలుస్తోంది. 

* ఇక అమెరికా డాలర్ విపరీతంగా పుంజుకోవటంతో రూపాయి మారకపు విలువ డాలరుకు రూ.87.66వద్ద ఉంది. మునుపటి ట్రేడింగ్ సెషన్లో ఇది 89 పైసల పతనాన్ని చూసింది. రూపాయి మారకపు విలువ పడిపోవటం విదేశీ దిగుమతుల చెల్లింపులను ఖరీదైనదిగా మార్చేస్తుందని, ఇది ఆర్థిక వ్యవస్థపై భారాన్ని పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.