భారతీయ యూజర్లు 34.6 కోట్లు    

భారతీయ యూజర్లు 34.6 కోట్లు    

స్పోర్ట్స్ 

మెక్ కియోన్ గోల్డెన్​ రికార్డ్

ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్‌‌ ఎమ్మా మెక్‌‌కియోన్‌‌ కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో అత్యధికంగా 11 గోల్డ్​ మెడల్స్ సాధించిన అథ్లెట్‌‌గా రికార్డులకెక్కింది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌‌లో స్వర్ణంగెలిచింది. 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌‌కోస్ట్‌‌ గేమ్స్‌‌లో నాలుగు స్వర్ణాల చొప్పున నెగ్గింది.

విజేత వెర్‌‌స్టాపెన్‌‌

2022 ఫార్ములావన్‌‌ సీజన్‌‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌‌బుల్‌‌  డ్రైవర్‌‌ మాక్స్‌‌ వెర్‌‌స్టాపెన్‌‌ విజయం నమోదు చేశాడు. హామిల్టన్‌‌ రెండో స్థానంలో, జార్జి రసెల్‌‌ మూడో స్థానంలో నిలిచారు.

నేషనల్ 

డోపింగ్‌‌ నిరోధక బిల్లుకు ఆమోదం 

జాతీయ యాంటీ డోపింగ్‌‌ సంస్థ (నాడా), జాతీయ డోప్‌‌ పరీక్షల ప్రయోగశాల (ఎన్‌‌డీటీఎల్‌‌) ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించే డోపింగ్‌‌ నిరోధక బిల్లుకు లోక్‌‌సభ ఆమోదం తెలిపింది.

సంపన్నురాలిగా రోష్ని నాడార్‌‌

దేశంలో అత్యంత సంపన్న మహిళగా హెచ్‌‌సీఎల్‌‌ టెక్నాలజీస్‌‌ చైర్‌‌పర్సన్‌‌ రోష్ని నాడార్‌‌ మల్హోత్రా అగ్రస్థానంలో నిలిచారు. నైకా బ్రాండ్‌‌ను ప్రారంభించిన ఫల్గుణి నాయర్‌‌ రెండో స్థానంలో నిలిచింది. బయోకాన్‌‌ కిరణ్‌‌ మజుందార్‌‌ షా మూడో ర్యాంకులో ఉన్నారు.
 
సెంట్రల్‌‌ విజిలెన్స్‌‌ కమిషనర్‌‌గా సురేష్‌‌ ఎన్‌‌ పటేల్‌‌ 

సెంట్రల్‌‌ విజిలెన్స్‌‌ కమిషనర్‌‌గా సురేష్‌‌ ఎన్‌‌ పటేల్‌‌ నియామకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌‌ కమిటీ ఇటీవల ఆమోదించింది.  గతేడాది జూన్‌‌ నుంచి సురేష్ తాత్కాలిక సీవీసీగా పని చేస్తున్నారు.

భారతీయ యూజర్లు 34.6 కోట్లు    

ఈ–కామర్స్, డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ వంటి ఆన్‌‌లైన్‌‌ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యూఎస్‌‌ జనాభా కంటే అధికం. 2019లో దేశంలో ఆన్‌‌లైన్‌‌ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరిగింది.  

తదుపరి సీజేఐగా జస్టిస్​ లలిత్​ 

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్‌‌ ఉమేశ్‌‌ లలిత్‌‌ ఎంపికయ్యారు.  ఈ నెల 26వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా రిటైర్​ కానుండడంతో జస్టిస్‌‌ లలిత్‌‌ 49వ సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. 

వ్యక్తులు

ఛరిష్మా కృష్ణ 

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం పైన్‌‌ ఆర్ట్స్‌‌ విభాగం విద్యార్థిని ఛరిష్మా కృష్ణ మిస్‌‌ సౌత్‌‌ ఇండియాగా ఎంపికయ్యారు. పెగాసస్‌‌ గ్లోబల్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ సంస్థ కేరళలోని కోచిలో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.   

ఆశిష్‌‌ కుమార్‌‌

నేషనల్‌‌ స్టాక్‌‌ ఎక్స్ఛేంజీ  ఎండీ, సీఈవోగా ఆశిష్‌‌ కుమార్‌‌ చౌహాన్‌‌ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన బీఎస్‌‌ఈ ఎండీ, సీఈఓగా రాజీనామా చేశారు.  ఎండీ, సీఈఓ నియామకం వరకు  వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కమిటీ చూసుకుంటుందని బీఎస్‌‌ఈ వెల్లడించింది.

జస్టిస్‌‌ ఎన్వీ రమణ 

ఉస్మానియా యూనివర్సిటీ రెండు దశాబ్దాల తర్వాత గౌరవ డాక్టరేట్‌‌ను ప్రకటించింది. 82వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఎన్వీ రమణ 48వ ఓయూ గౌరవ డాక్టరేట్‌‌ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ డాక్టరేట్‌‌ అందుకుంటున్న మొదటి తెలుగు వ్యక్తిగా చీఫ్‌‌ జస్టిస్‌‌ ఎన్వీ రమణ నిలవనున్నారు.

డా.ప్రతిమా చౌదరి

బ్రిటన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్‌‌లలోని హీమోఫీలియా సెంటర్‌‌ డాక్టర్లకు సంబంధించిన ‘ద యునైటెడ్‌‌ కింగ్‌‌డమ్‌‌ హీమోఫీలియా సెంటర్‌‌ డాక్టర్స్‌‌ ఆర్గనైజేషన్‌‌ (యూకేహెచ్‌‌సీడీఓ)’ చైర్‌‌పర్సన్‌‌గా ప్రొఫెసర్‌‌ డా.ప్రతిమా చౌదరి మావిళ్లపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి.

అమితాబ్‌‌ కాంత్‌‌

నీతి ఆయోగ్‌‌ మాజీ సీఈవో అమితాబ్‌‌ కాంత్‌‌ జీ–20కు భారత కొత్త షెర్పాగా సేవలు అందించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌‌ గోయల్‌‌ ఇప్పటి వరకు ఈ బాధ్యతలు చూశారు. జీ–20 అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాది భారత్‌‌కు రానున్నాయి. దీంతో షెర్పా బాధ్యతల్లో ఉన్న వారు సమావేశాలు నిర్వహించాలి.

తెలంగాణ 

రామగుండంలో ఫ్లోటింగ్​ సోలార్​ ప్లాంట్​

దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌‌(నీటిపై తేలియాడే) సోలార్‌‌ ప్లాంట్‌‌ను ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌‌గా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా  రూ.423 కోట్లతో ఈ ప్లాంట్‌‌ను నెలకొల్పారు.

పోలీస్​ కమాండ్​ కంట్రోల్ సెంటర్​ 

ఇంటిగ్రేటెడ్‌‌ కమాండ్‌‌ అండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌ను సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. ఏడెకరాల్లో రూ.600కోట్లతో  కమాండ్​ అండ్​ కంట్రోల్​ సెంటర్​ను నిర్మించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ 

భారీ సూపర్​నోవా గుర్తింపు​

భూమికి 30 లక్షల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో ఉన్న ఓ పాలపుంతలో భారీ సూపర్‌‌నోవాను జేమ్స్‌‌ వెబ్‌‌ టెలిస్కోప్‌‌ గుర్తించింది. నక్షత్రం  పేలిపోయినప్పుడు వెలువడే అపారమైన కాంతిని సూపర్‌‌నోవాగా పిలుస్తారు.

ఇంటర్నేషనల్ 

తైవాన్​లో నాన్సీ పెలోసీ పర్యటన

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌‌ నాన్సీ పెలోసీ తైవాన్‌‌లో పర్యటించారు. చైనా  హెచ్చరికలు లెక్కచేయకుండా 25ఏళ్ల తర్వాత తైవాన్‌‌ను సందర్శిస్తున్న అత్యున్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం విశేషం. తైవాన్‌‌లో ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి తగిన సాయాన్ని అందిస్తామని ఆమె పేర్కొన్నారు.  

పాక్‌‌ పంజాబ్‌‌ సీఎంగా పర్వేజ్‌‌ ఇలాహీ 

పాకిస్థాన్‌‌లోని పంజాబ్‌‌ ముఖ్యమంత్రిగా చౌదరి పర్వేజ్‌‌ ఇలాహీ ప్రమాణ స్వీకారం చేశారు.   పాక్‌‌ అధ్యక్షుడు ఆరిఫ్‌‌ అల్వీ ఇలాహీతో పంజాబ్‌‌ సీఎంగా ప్రమాణం చేయించారు.

అల్​కాయిదా ఛీఫ్​ హత్య

అల్‌‌-కాయిదా చీఫ్‌‌.. 9/11 అమెరికాలోని వరల్డ్‌‌ ట్రేడ్‌‌ సెంటర్‌‌(డబ్ల్యూటీసీ) ట్విన్‌‌ టవర్స్‌‌పై ఉగ్రదాడిలో భాగస్వామి అయ్‌‌మాన్‌‌ అల్‌‌-జవహరి హత్యకు గురయ్యాడు. పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్‌‌లో అమెరికా గూఢచార సంస్థ సెంట్రల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ ఏజెన్సీ(సీఐఏ), కౌంటర్‌‌ టెర్రరిజం ఆపరేషన్‌‌ బృందాలు అఫ్ఘానిస్థాన్‌‌ రాజధాని నగరం కాబూల్‌‌లో మట్టుబెట్టాయి.