సీమా హైదర్‌లా కాదు.. త్వరలో ఇండియాకు వస్తా: ప్రేమ కోసం పాక్ వెళ్లిన మహిళ

సీమా హైదర్‌లా కాదు.. త్వరలో ఇండియాకు వస్తా: ప్రేమ కోసం పాక్ వెళ్లిన మహిళ

రాజస్థాన్‌కు చెందిన అంజు(34) అనే వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైన తన ప్రేమికుడిని కలవడానికి ఇండియా బార్డర్ దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లింది. ఆమె ప్రేమ కథను సీమా హైదర్ స్టోరీతో పోల్చడంపై అంజు అభ్యంతరం వ్యక్తం చేసింది.  తాను చట్టబద్ధంగానే పాకిస్థాన్‌కు వెళ్లానని, మరికొద్ది రోజుల్లో భారత్‌కు తిరిగి వస్తానని చెప్పింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు.

ALSO READ:ప్రియుడితో పారిపోయిన భార్యకు పెళ్లి చేసిన భర్త

ప్ర: మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, అంజు?
జ: నేను పాకిస్థాన్‌లో ఉన్నాను. ఇది మనాలి లాంటి పర్వత ప్రాంతం.  నేను ఇక్కడ సేఫ్ గా ఉన్నాను.
ప్ర: పాకిస్థాన్ వెళ్లే విషయం మీ భర్తకు తెలియజేశారా?
జ: లేదు, నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు.  జైపూర్‌ వెళుతున్నానని చెప్పాను.
ప్ర: పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లారు?
జ:  నేను పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం ఇక్కడికి వచ్చాను. ఓ పెళ్లికి కూడా అటెండ్​ అయ్యాను. 
ప్ర: భివాడి నుంచి పాకిస్థాన్‌కి ఎలా చేరుకున్నారు?
జ:  నేను వాఘా బోర్డర్ నుంచి పాకిస్థాన్ చేరుకున్నాను. ముందుగా భివాడి నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత అమృత్‌సర్‌కు వెళ్లాను. ఆ తర్వాత వాఘా బోర్డర్‌కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్‌లోకి ఎంటర్​ అయ్యాను.
ప్ర:  పాకిస్థాన్‌లో ఎవరితో కలిసి ఉన్నారు?
జ:  ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్​ ఉన్నాడు. అతని కుటుంబంతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం మేం స్నేహితులం అయ్యాం.  నాకు ఇక్కడ ఇంకేమీ లేదు. నన్ను సీమ హైదర్‌తో పోల్చడం తప్పు. నేను ఇండియాకి తిరిగి వస్తాను. 
ప్ర: ఎప్పట్లోగా తిరిగి వస్తారు?
జ: 2-4 రోజుల్లో..
ప్ర: నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లారా?
జ:  లేదు, మీడియా అలా క్రియేట్​ చేస్తోంది. నేను సీమ హైదర్ లా కాదు.
ప్ర:నస్రుల్లాతో ఎలా దగ్గరయ్యారు?
జ:  మా స్నేహం 2020లో ప్రారంభమైంది. ఫేస్​బుక్​లో పరిచయం అయిన నస్రుల్లాతో మాట్లాడటం స్టార్ట్​ చేశా. ఫేస్‌బుక్‌తో మొదలై తర్వాత నంబర్లు మార్చుకుని వాట్సాప్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. నాకు నస్రుల్లా రెండు మూడు సంవత్సరాలుగా తెలుసు. మొదటిరోజే ఈ విషయం మా అక్క, అమ్మలకు చెప్పాను.
ప్ర: మీరు మీ భర్త నుండి విడిపోవాలనుకుంటున్నారా?
జ:  అవును. మొదటి నుంచి మా మధ్య మంచి సంబంధాలు లేవు. కొన్ని పరిస్థితుల వల్ల అతని దగ్గరే ఉంటున్నాను. అందుకే నాతో పాటు మా అన్న, కోడలు కూడా తీసుకొచ్చాను. నా పిల్లల కోసం నేను వారితోనే ఉంటున్నాను. ఈ మధ్య నాకు గురుగ్రామ్‌లో ఉద్యోగం కూడా వచ్చింది. నస్రుల్లాతో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు. ఇండియాకు తిరిగి వచ్చాక పిల్లలతో కలిసి వేరేగా ఉండాలనుకుంటున్నాను. 
ప్ర: పాక్​ వెళ్ళడానికి ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారు? 
జ:  10 రోజుల సెలవు తీసుకున్నాను. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే వేరొకరిని తీసుకోవచ్చని యాజమాన్యానికి చెప్పాను.
ప్ర: భారత్​కి తిరిగి వచ్చి మీ కుటుంబంతో కలిసి జీవించాలనుకుంటున్నారా లేదా పాకిస్తాన్‌లో వారితో కలిసి ఉండాలనుకుంటున్నారా?
జ: ప్రస్తుతానికి నా దగ్గర అలాంటి ప్లాన్లు ఏమీ లేవు. భవిష్యత్తులో నా నిర్ణయాన్ని వెల్లడిస్తా.