రూ.712 కోట్ల స్కాం.. 15వేల మంది బాధితులు ఇండియన్సే..

రూ.712 కోట్ల స్కాం.. 15వేల మంది బాధితులు ఇండియన్సే..

చైనీస్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న రూ.700 కోట్ల విలువైన క్రిప్టోవాలెట్ పెట్టుబడి మోసానికి గురైన కనీసం 15 వేల మంది భారతీయులలో సాఫ్ట్​ వేర్​ నిపుణులు సైతం ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జులై 24న తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మోసానికి సంబంధించిన కొన్ని క్రిప్టోవాలెట్ లావాదేవీలు టెర్రర్ ఫైనాన్సింగ్ మాడ్యూల్‌  లింక్‌లను కలిగి ఉన్నాయని తెలిపారు.

ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు కేంద్ర ఏజెన్సీలకు తెలియజేస్తున్నారని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధిత వివరాలన్నీ అందించామని సీపీ చెప్పారు. అత్యధిక వేతనం పొందుతున్న సాఫ్ట్​వేర్​నిపుణులు సైతం రూ.82 లక్షల వరకు డబ్బులు కోల్పోవడం బాధాకరమన్నారు. 

'రేట్ అండ్ రివ్యూ' స్కామ్

పార్ట్​టైం జాబ్​ ఆఫర్ తో రేట్​ అండ్​ రివ్యూ అంటూ ఓ లింక్​ క్లిక్ చేసి తాను మోసపోయానని ఓ బాధితుడు వాపోయాడు. రూ.వెయి పెట్టుబడితో రూ.25వేల లాభం అంటూ బురిడీ కొట్టించారు సైబర్​నేరగాళ్లు. చివరికి రూ.28 లక్షలు కోల్పోయాడు.  టెలిగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కనీసం  15 వేల మంది బాధితులు, సగటున 5-6 లక్షల రూపాయల నష్టాన్ని చవిచూశారు.  

మోసానికి పాల్పడిన షెల్ కంపెనీలతో సంబంధం ఉన్న 48 బ్యాంకు ఖాతాలను అధికారులు గుర్తించారు. అప్పట్లో ఈ స్కాం అంచనా విలువ రూ.584 కోట్లు.అయితే, విచారణ జరుగుతున్నప్పుడే స్కామర్లు అదనంగా రూ. 128 కోట్లు కొల్లగొట్టారని  పోలీసులు తెలిపారు. అక్రమ నగదు చివరికి క్రిప్టో కరెన్సీగా మార్చారు. ఈ డబ్బును దుబాయ్​ మీదుగా చైనాకు తరలించారు. 

తొమ్మిది మంది అరెస్ట్

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో - హైదరాబాద్‌కు చెందిన నలుగురు, ముంబైకి చెందిన ముగ్గురు, అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరున్నారని సీపీ తెలిపారు.  మరో ఆరుగురు నిందితులు దుబాయిలో ఉన్నారని వారిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా రూ.712 కోట్ల ఈ స్కాంలో ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆనంద్​సూచించారు.