నమో భారత్ : ఇండియాలో ఫస్ట్ RRTS రైళ్లు ప్రారంభం.. ఏంటీ రైళ్ల ప్రత్యేకత

నమో భారత్ : ఇండియాలో ఫస్ట్ RRTS రైళ్లు ప్రారంభం.. ఏంటీ రైళ్ల ప్రత్యేకత

దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న  ర్యాపిడ్‌ఎక్స్‌ సెమీ-హైస్పీడ్‌ రైళ్లకు పేరు మార్చారు.  వీటికి నమో భారత్ గా నామకరణం చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.  ఢిల్లీ-ఘజియాబాద్‌-మేరఠ్‌ RRTS కారిడార్‌లో సాహిబాబాద్‌, దుహై డిపో మధ్య సేవలందించే ఈ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ 2023 అక్టోబర్ 20న ప్రారంభించనున్నారు .  ఈ సందర్భంగా సాహిబాబాద్‌, దుహై డిపో మధ్య 17కి.మీల ప్రాధాన్యత కలిగిన కారిడార్‌లో దేశంలోనే తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ రైలుకు పచ్చజెండా ఊపుతారు. అక్టోబర్‌ 21 నుంచి ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

రూ.30వేల కోట్లతో చేపట్టిన 85.2 కి.మీల ఢిల్లీ-ఘజియాబాద్‌-మేరఠ్‌ ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌కు ప్రధాని మోదీ 2019 మార్చి 8న శంకుస్థాపన చేయగా..  దీన్ని 2025 జూన్‌ నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ నమో భారత్ లో  సాహిబాబాద్, దుహై డిపోల మధ్య ప్రయాణ సమయం 12 నిమిషాలు ఉంటుంది, సాధారణంగా రోడ్డు మార్గంలో అయితే  30 నుంచి -35 నిమిషాలు పడుతుంది.

నమో భారత్ రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సర్వీసులందిస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున సర్వీసులందిస్తాయి. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి.  స్టాండర్డ్‌ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి.  ఒక కోచ్‌ను మహిళల కోసం రిజర్వు చేశారు. స్టాండర్డ్‌ కోచ్‌లలో కనీస టికెట్‌ ధర రూ.20 కాగా.. గరిష్ఠ ధర రూ.50గా నిర్ణయించారు. అలాగే,  ప్రీమియం కోచ్‌లలో అయితే కనీస టికెట్‌ ధర రూ.40 కాగా.. గరిష్ఠ ధర రూ.100

ఇక  ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లకు నమో భారత్‌ గా పేరు మార్పుపై కాంగ్రెస్ మండిపడుతుంది.  ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ లో ఫైరయ్యారు.   నమో స్టేడియం తర్వాత ఇప్పుడు నమో రైళ్లు. స్వీయ ప్రచారానికి హద్దు లేకుండా పోయిందంటూ విమర్శించారు. ఇక దేశానికి కూడా అదే పేరు పెడితే బాగుంటుందని మరో నేత పవన్‌ ఖేడా అన్నారు.