చెప్పులు అంటే తెలియదు.. ఆస్పత్రికి వెళ్లరు..

చెప్పులు అంటే తెలియదు.. ఆస్పత్రికి వెళ్లరు..

భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. అంతే కాదు చాలా భిన్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటించే గ్రామాలు కూడా ఉంటాయి. కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్‌లో ఒక గ్రామం ఉందని, అక్కడ స్వంతంగా ఓ చట్టం ఉందనే వార్త వెలుగులోకి వచ్చింది. అదే తరహాలో ఓ గ్రామంలో భిన్న ఆచారాలను పాటిస్తున్నారు. అక్కడి ప్రజలు బూట్లు, చెప్పులు ధరించరు. బయటి నుంచి వచ్చే వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ లోని వేమన ఇండ్లు గ్రామం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 25 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో మొత్తం జనాభా 80 మంది. గ్రామం చాలా చిన్నదే అయినప్పటికీ, ఇక్కడ నియమాలు, సంప్రదాయాలు ప్రత్యేకమైనవి. గ్రామంలోని చాలా కుటుంబాలు నిరక్షరాస్యులు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటాయి.

పలు కథనాల ప్రకారం, పాల్వేకారి వర్గానికి చెందిన వారు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. తమను తాము దొరవర్లుగా గుర్తించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కులాన్ని వెనుకబడిన తరగతిలోనే ఉంచారు. ఇప్పుడు ఇక్కడి నియమాల గురించి చెప్పాలంటే, ఇక్కడ ఎవరూ ఆసుపత్రికి వెళ్లరు. తాము పూజించే దేవుడే అన్నీ చూసుకుంటాడని నమ్ముతారు. ఆ గ్రామంలోనే ఒక గుడి ఉండడంతో అక్కడే వారు పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని కూడా పూజించరు. ఇక్కడే ఓ వేప చెట్టు కూడా ఉంది. ఎవరికైనా, ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు దాని చుట్టూ తిరుగుతారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు కానీ ఆసుపత్రికి వెళ్లరు.

బయటి వారికీ అవే రూల్స్..

బయట నుంచి ఎవరైనా వచ్చినా షూస్ విప్పి ఊరికి వెళ్లాలన్నంత కఠినంగా ఈ రూల్ ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. ఇంకొక సంప్రదాయం ఏమిటంటే, ఊరిలో ఎవరైనా బయటి నుంచి వస్తే, అతను స్నానం చేయకుండా లోపలికి రాకూడదు. పీరియడ్స్ సమయంలో ఆడవారిని ఊరి బయట ఉంచుతారు. వారికి అన్ని వస్తువులు అక్కడికే తెచ్చి ఇస్తారు.