దేశంలో 60 శాతం సంపద ఒక శాతం మంది దగ్గరే.. బంగారం రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు..

దేశంలో 60 శాతం సంపద ఒక శాతం మంది దగ్గరే.. బంగారం రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు..
  • విలువ 11.6 ట్రిలియన్​ డాలర్లు
  • వెల్లడించిన బెర్న్​స్టెయిన్ రిపోర్ట్​

న్యూఢిల్లీ: మనదేశంలో ఆదాయ అసమానతల గురించి అమెరికా వెల్త్​ మేనేజ్​మెంట్​ కంపెనీ బెర్న్‌‌‌‌స్టెయిన్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీని రిపోర్ట్​ ప్రకారం,  ఇండియాలోని అత్యంత ధనవంతులైన ఒకశాతం మంది దగ్గరే మొత్తం దేశ సంపదలో దాదాపు 60శాతం ఉంది. వీరిలో అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు (యూహెచ్​ఎన్​ఐలు), హై నెట్ వర్త్ వ్యక్తులు (హెచ్​ఎన్​ఐ),  ధనవంతులు ఉన్నారు. జనాభాలో వీరి సంఖ్య ఒకశాతం మించడం లేదు. 

దేశంలోని మొత్తం ఇంటి సంపద  విలువ 19.6 ట్రిలియన్ డాలర్లు కాగా, వీరి దగ్గర11.6 ట్రిలియన్ డాలర్లు (దాదాపు 59శాతం) ఉన్నాయి. వీళ్ల మొత్తం ఆస్తులలో 60శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని రియల్ ఎస్టేట్,  బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడుతున్నారు.  కొన్ని పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు, ఇన్సూరెన్స్,  బ్యాంకు లేదా ప్రభుత్వ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఈ ధనవంతుల వద్ద ఉన్న మొత్తం ఆర్థిక ఆస్తులలో,  2.7 ట్రిలియన్ డాలర్లు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్,  ఈక్విటీల రూపంలో ఉన్నాయి. మిగిలిన 8.9 ట్రిలియన్ డాలర్లు బంగారం, రియల్ ఎస్టేట్,  నగదు రూపంలో ఉన్నాయి.  

మనదేశంలోని ఒక శాతం ధనవంతులు మొత్తం ఆస్తుల విలువ రూ. 1,350 లక్షల కోట్లకు చేరింది. వీళ్ల సంపద 2014లో 49శాతం నుంచి 2025లో 60శాతానికి పెరిగింది. రియల్ ఎస్టేట్ (40శాతం), బంగారం (25శాతం), ఈక్విటీలు (20శాతం)లో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరులో లగ్జరీ ఆస్తులపై దృష్టి పెడుతున్నారు. జనాభాలో 10శాతం మంది చేతిలో 77శాతం సంపద ఉండగా,   50శాతం మంది చేతిలో 4.7% సంపద ఉంది. ఇండియాలో దాదాపు 35 వేల యూహెచ్​ఎన్​ఐ కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి సగటున 12 మిలియన్ ​డాలర్ల విలువైన నికర ఆస్తులు ఉన్నాయని బెర్న్​స్టెయిన్  తెలిపింది.