ఇకపై 3 డోర్ల నుంచే దిగొచ్చు

ఇకపై 3 డోర్ల నుంచే దిగొచ్చు

న్యూఢిల్లీ: ప్రయాణికులు విమానం దిగడాన్ని మరింత సులభంగా చేయడానికి ఇండిగో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. మూడు డోర్ల నుంచి ఒకేసారి దిగడానికి ప్యాసెంజర్లకు అనుమతిస్తోంది. విమానం ముందు వైపు ఉన్న రెండు డోర్ల నుంచి, వెనక వైపు ఉన్న ఒక డోర్ నుంచి ప్రయాణికులు దిగేలా  వీలు కలిపిస్తామని కంపెనీ ప్రకటించింది. కంపెనీ 16 వ యానివర్శరి సందర్భంగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని ఇండిగో సీఈఓ రోనోజాయ్‌ దత్తా అన్నారు. ఈ కొత్త విధానం వలన 5 నుంచి 6 నిమిషాల టైమ్‌ తమకు కలిసొస్తుందని, దీంతో విమానాలను వేరేచోటుకి తొందరగా పంపడానికి వీలుంటుందని అన్నారు. ‘ప్రస్తుతం  ఒక ఏ321 విమానం రెండు డోర్ల నుంచి ప్రయాణికులు దిగడానికి 13–14 నిమిషాలు పడుతోంది. అదే మూడు వైపుల నుంచి ప్రయాణికులు దిగితే ఏడెనిమిది నిమిషాలు  మిగులుతాయి’ అని అన్నారు. 16 వ యానివర్శరి సందర్భంగా రూ. 1,616 నుంచే దేశీయంగా తిరగడానికి  కంపెనీ ఓ ఆఫర్‌‌ను బుధవారం ప్రకటించింది. దేశంలోని అన్ని రూట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ పొందడానికి ఆగస్ట్‌ 3 నుంచి ఆగస్ట్ 5 లోపు టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఆగస్ట్‌ 18, 2022 నుంచి జులై 16,2023 మధ్య ట్రావెల్ చేయడానికి మాత్రమే టికెట్ బుక్ చేసుకోవాలి. 

ఇండిగో రెవెన్యూ పైకి..
ఇండిగో  రెవెన్యూ (కార్యకలాపాల నుంచి) ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌లో రూ. 12,855.3 కోట్లకు పెరిగింది.  కిందటేడాది జూన్ క్వార్టర్‌‌లో రూ. 3,006.9 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఫ్యూయల్ రేట్లు ఎక్కువగా ఉండడం, రూపాయి పతనం వంటి అంశాలు కంపెనీ లాభంపై ప్రభావం చూపాయి. ఇండిగోకి కిందటేడాది జూన్ క్వార్టర్‌‌లో రూ. 3,174.2 కోట్ల నష్టం రాగా, ఈసారి  రూ.1,064 కోట్లకు నష్టం తగ్గింది.