వీపనగండ్ల, వెలుగు: కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాలకు సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు వీపనగండ్ల మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా చీరలు, లబ్ధిదారులకు కల్యాణ లక్షీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా .. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నామని, మిగిలిన వాటిని సైతం అమలు చేస్తామని చెప్పారు.
500 కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల కొంతమంది లబ్ధిదారులకు అందడం లేదని వాటిని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి త్వరలోనే అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదునపు కలెక్టర్ ఖీమా నాయక్. డీఆర్డీఓ ఉమాదేవి, అధికారుల, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు..
వంగూరు, చారకొండ, మండలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. నాగర్ కర్నూల్, తెలకపల్లి, బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయాల్లో ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు.
చిన్నచింతకుంట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో మాజీ జడ్పీచైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్స్ అందిస్తున్నామన్నారు. ఉపాధితో పాటు వ్యాపారంగంలో మహిళలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు.
