
- లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇస్తున్న అధికారులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నియోజకవర్గంలో అర్హులైన 4 వేల మందిని ఎంపిక చేయగా.. 3,850 మంది లబ్ధిదారులకు తాజాగా ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. పంచాయతీ, హౌసింగ్ ఆఫీసర్లు, కాంగ్రెస్ నాయకులు వారికి సంబంధిత కాపీలను అందజేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తమకు బతుకమ్మ పండుగకు తీపికబురు చెప్పిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పైలట్‌ప్రాజెక్టు గ్రామాల్లో పనులు..
రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంటే.. కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం పైలట్ గ్రామాలైన బద్దిపల్లి, బహుదూర్ ఖాన్ పేటలోనే ఇండ్ల పనులు మొదలయ్యాయి. కరీంనగర్ సిటీతోపాటు నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను నియమించలేదు. లబ్ధిదారులను ఎంపిక చేయలేదు.
ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో ఇందిరమ్మ కమిటీలు లేకుండా అధికారులే సర్వే చేసి.. లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ జాబితాకు ఇన్ చార్జి మంత్రి ఆమోద ముద్ర వేయడంతో ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండటంతో కొత్తపల్లి మండలంలో 412 మందికి, కరీంనగర్ రూరల్ మండలంలో 1,050 మందికి, కరీంనగర్ సిటీలో సుమారు 1,000 మందికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు.
సీఎం దసరా కానుక
కరీంనగర్ నియోజకవర్గంలోని పేదలకు దసరా కానుకగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. మరో 4 వేల ఇండ్లు కేటాయించాలని ఆయనకు విజ్ఞప్తి చేశాను. సానుకూలంగా స్పందించారు. అర్హులందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. బిల్లులు వెనువెంటనే వచ్చేలా చూస్తా. లబ్ధిదారులు ఇండ్ల పనులు తర్వగా పూర్తి చేసుకోవాలి.– వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జి
అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నియోజకవర్గ ప్రజలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించాం. కొన్ని అనివార్య కారణాల వల్ల లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరిగింది. ప్రొసీడింగ్కాపీలు అందిస్తున్నాం. అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం. – కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్