
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలు పూర్తయినప్పటికీ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నప్పటికీ.. నిధుల కొరత వెంటాడుతూనే ఉన్నది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలలో ప్రధానమైనది ఇండ్లు లేని నిరుపేదలకు ఉచితంగా రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామనేది అత్యంత కీలకం. అందుకు అనుగుణంగానే 2024-–25 సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4.5 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పి..ఒక సంవత్సరం పూర్తయింది.
గత బడ్జెట్లో ఇండ్ల పథకానికి రూ.21 వేల కోట్లు అవసరమని ప్రకటించింది. పూర్తి నిధులను కేటాయించలేదు. గత సెప్టెంబర్లో కొత్తగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లకోసం ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరించారు. మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు పెట్టుకోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇందిరమ్మ ఇండ్ల కోసం 77.18 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.
గుర్తింపునకు మార్గదర్శకాలు
దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు సమగ్రంగా సర్వే చేసి 36.03 లక్షల(46.7 శాతం) మంది అర్హులని గుర్తించారు. మిగతా 41.15 లక్షలు(53.3 శాతం) మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులంతా దారిద్ర్యరేఖ (బిపిఎల్ )కు ఎగువ ఉన్నవారేనని నిర్ధారించారు. ఇండ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్ లో నమోదు చేశారు. యాప్లో పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు.. ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను 3 కేటగిరీలుగా విభజించారు. ఎల్-1లో 23.05 లక్షలు, ఎల్ -2లో 21.44 లక్షలు, ఎల్-3లో 32.69 లక్షల దరఖాస్తుదారులు ఉన్నట్లు తేల్చారు.
ఎల్ -1 జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇండ్లు లేని వారిని చేర్చారు. సొంత స్థలంలో పూరిల్లు, మట్టి మిద్దెలు, రేకుల ఇండ్లు ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. ఎల్ -2లో జాబితాలో స్థలాలు, ఇండ్లు లేని వారిని చేర్చారు. ఎల్ -3 జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు, కార్లు ఉన్నవారు, దారిద్ర్య రేఖ బిపిఎల్ కు ఎగువన ఉన్నవారు, ఆదాయం పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు. వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు.
లబ్ధిదారుల లిస్టుపై గందరగోళం
ఈ జాబితాలలో వచ్చిన లబ్ధిదారుల పేర్లను అయాగ్రామాలలో నిర్వహించిన గ్రామసభలలో వివరించటంతో.. వాటిపై అనేక ఫిర్యాదులు ముఖ్యంగా గ్రామాలలో ఉండని వారిపేర్లు ఉండటం.. వారు పట్టణ ప్రాంతాలలో ఇండ్లు, ఆస్తులు ఉన్న వారి పేర్లు మొదటి లిస్టులో రావడం..ఊర్లో ఉండే ఇండ్లస్థలాలు లేనివారి పేర్లు రాకపోవడంతో.. కొంత అలజడి జరిగిన నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది.
గ్రామాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పురపాలికల వారిగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధంచేసి ఉంచింది. దానిపై తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య 41.15 లక్షలకు పెరిగింది. నిబంధన ప్రకారం ఎల్- 3 జాబితాలో చేర్చిన వారంతా అనర్హు లేనని తేల్చారు.
పెరిగిన దరఖాస్తులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పుతూ 9 సంవత్సరాలు కాలం గడుపుతూ వచ్చిందే తప్ప.. ఏ ఒక్క గ్రామంలో నిర్మాణం చేపట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడంతో.. ఈ ప్రభుత్వమైనా ఇండ్లు ఇస్తుందన్న ఆశతో గ్రామసభలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ గ్రామ సభలలో గతంలో దరఖాస్తులు పెట్టుకున్న వారి పేర్ల జాబితాను చదివి వినిపించటం.. పేర్లు రాని వారు తిరిగి దరఖాస్తులు పెట్టుకోవాలని అధికారులు తెల్పటం.. ఆశతో గ్రామీణ పేదలు వందల, వేల సంఖ్యలో దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటిలో 20 శాతానికి పైగా దరఖాస్తులను సరైన వివరాలు లేకపోవడంతో తిరస్కరించారు. స్థలము లేని వారిని రెండో విడత పేరుతో పక్కకు పెట్టడంతో సగం దరఖాస్తులు మాత్రమే మిగిలాయి. క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు బ్యాంకు ఖాతాలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సింహభాగం దరఖాస్తులను పక్కకు పెట్టారు.
ఎంపికల్లో వివక్ష సరికాదు
నిధుల లేమితో ప్రభుత్వం ఏదో ఒక కారణంతో దరఖాస్తుల ఏరివేత పనిగా పెట్టుకోవడం సరికాదు. ఇందిరమ్మ కమిటీలతో గ్రామాల్లో అలజడి నెలకొన్నది. పేరుకు అర్హులైన వారిని జిల్లా కలెక్టర్ ఎంపిక చేస్తారని చెబుతున్నప్పటికీ.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన లిస్టులే ఫైనల్ అవటం, అనుకూలురులనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఊళ్లో, ఒకే విధమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారిలో కొందరికి ఇండ్లు మంజూరు చేయడం, మిగిలిన వారిని విస్మరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో నిరీక్షణ
ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామాలకే పరిమితమైంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పేదలకు'ఇన్ -సీటూ' పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ విధానంలో ప్రస్తుతం పేదలు నివసిస్తున్న (గుడిసెలలో నివసిస్తున్న) వారిని ఖాళీచేయించి అక్కడే వారికి జి2 అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినప్పటికి, అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. వాస్తవానికి ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో 10 లక్షలకు పైగా హైదరాబాదులోనే ఉన్నాయి.
గత ప్రభుత్వ నిర్వాకం ఇలా..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పింది. 9 సంవత్సరాల క్రితం 2015 అక్టోబర్లో 2,91,057 ఇండ్లను మంజూరు చేసింది. టెండర్లు పిలిచింది 2,29,451 ఇండ్లకు మాత్రమే. గత ప్రభుత్వం దిగిపోయేవరకు పూర్తి అయినవి 1,13,535 మాత్రమే. ఎన్నికల ముందు ఆదరాబాదరాగా 61,606 లబ్ధిదారులకు పంపిణీ చేసింది.
ఇంకా అసంపూర్తిగా ఉన్నవి 46,488. వీటిని పూర్తి చేయటానికి, పంపిణీ చేసిన కాలనీలో మౌలిక సదుపాయలకి.. కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన పెండింగు బిల్లులకు కనీసం రూ.6 వేలకోట్లు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వీటిని పూర్తిచేసి నగరములోని పలు ప్రాంతాలలోని లబ్దిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచించుతున్నప్పటికీ నిధుల సమీకరణే పెద్దసమస్యగా ఉందని తెలుస్తుంది.
ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి
ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చుటకు ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామనే వాగ్దానం నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడితేనే పేదప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉంటారు. ప్రతిసంవత్సరం 4.5 లక్షల చొప్పున కట్టించాటానికి యుద్ధప్రాతిపదికగా ఇండ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నాం.
ఏటా 4.5 లక్షల ఇండ్లు
ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారంగా 2024-–25లో 4.5 లక్షల ఇండ్లు పూర్తిచేయాలి. 2025–-26 సంవత్సరానికి మరో 4.5 లక్షలు చేపట్టాల్సి ఉంది. అయితే తొలివిడతలో ఇవ్వాల్సిన 4.5 లక్షల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం 47,335 ఇండ్లను మాత్రమే మంజూరు చేసింది. వాటి లబ్ధిదారులకు మొదటి, రెండో విడత వాయిదాల కింద రూ. 53.64 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తం 4.5 లక్షలు ఇళ్ల నిర్మాణానికి రూ. 21వేల కోట్లు అవసరం అవుతాయి. అందులో దాదాపు రూ.6 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేది ఉండగా.. మిగిలిన రూ. 15 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమీకరణలో ఉన్నది.
- ఉజ్జిని రత్నాకర్ రావు,
సీపీఐ సీనియర్ నేత