ఇందిరమ్మ ఇండ్లకు రుణాలు .. యాదాద్రిలో 2 వేల మందికి ఇవ్వాలని లక్ష్యం

ఇందిరమ్మ ఇండ్లకు రుణాలు .. యాదాద్రిలో 2 వేల మందికి ఇవ్వాలని లక్ష్యం
  • 393 మందికి 4.34 కోట్ల రుణం
  • మిగిలిన వారికి రుణం అందించడానికి చర్యలు తీసుకుంటున్న ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణం స్పీడప్​ చేయాలని భావిస్తున్న సర్కారు ఆదేశాలతో లబ్దిదారులకు రుణాలు అందుతున్నాయి. లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇండ్ల నిర్మాణంపై వెనుకడగు వేసిన లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. 

యాదాద్రికి 9175 ఇండ్లు

యాదాద్రి జిల్లాలో మొదటి విడతగా 9175 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇండ్లు మంజూరు సమయంలోనే పేదలకు  రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 5980 ఇండ్లకు ముగ్గులు పోశారు. చాలా మంది ఇల్లు నిర్మాణం మొదలు పెట్టడానికి డబ్బు సమకూరక పోవడంతో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు. 

మూడు రకాలుగా  రుణాలు

ఇల్లు మంజూరైన లబ్ధిదారుల మహిళా సంఘాల్లో సభ్యులై ఉంటే రుణం పొందడానికి అర్హులు.  దీంతో సంఘాల లీడర్లతో ఆఫీసర్లు సంప్రదింపులు జరిపి, రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. రుణం మూడు రకాలుగా తీసుకునే అవకాశం ఉంది. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, సంఘం అంతర్గత పొదుపు నుంచి రుణం అందించే విధంగా డీఆర్​డీఏ చర్యలు తీసుకుంటోంది. సభ్యుల అర్హతను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. సంఘాల్లో తీసుకున్న రుణాన్ని 10  సులభ వాయిదాల్లో చెల్లించే విధంగా అవకాశం ఉంది.  గతంలో రుణం తీసుకొని ఉంటే మాత్రం నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేసే సొమ్ములోంచి తీసుకున్న రుణం చెల్లించాల్సి ఉంటుంది. 

393 లబ్ధిదారులకు రుణాలు

జిల్లాలో మొత్తంగా 2 వేల మందికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని జిల్లా ఆఫీసర్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందులో ఇప్పటివరకూ 393 మందికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకూ అందించారు. మొత్తంగా 4.34 కోట్లు రుణంగా అందించారు. ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకే రుణం అందించారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లోని లబ్ధిదారులకు రుణాలు 
ఇప్పించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నిర్మాణానికి రుణం అందించేలా చర్యలు: 

ఇల్లు మంజూరైన లబ్దిదారుల్లో నిర్మాణం ప్రారంభించడానికి డబ్బు సమకూరక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాదేశాలతో వారికి మహిళ సంఘాలు, బ్యాంక్​ లింకేజీ, స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. 2 వేల మందికి ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.   

 ఏ భాస్కర్​రావు, అడిషనల్​ కలెక్టర్​, యాదాద్రి