
- ఎగుమతులపై నిషేధం ఎత్తేసిన ఇండోనేషియా
జకర్తా: వంట నూనెల ధరలను నియంత్రించేందుకు ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. పామాయిల్ ఎగుమతులపై నెల రోజుల కిందట విధించిన ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇవాళ ప్రకటించింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో ఎగుమతులపై విధించిన నిషేధంపై పునః పరిశీలన నిషేధం ఎత్తేయాలని నిర్ణయించింది. దేశీయంగా బల్క్ కుకింగ్ ఆయిల్ సరఫరా మెరుగుపడడంతోపాటు దేశీయంగా సరిపడా నిల్వలు జమ కావడంతో పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. సోమవారం నుంచి నిషేధం ఎత్తివేత అమలులోకి వస్తుందని ఇండోనేషియా దేశాధ్యక్షుడు జొకొ విడొడొ ప్రకటించారు.
ఎగుమతులపై నిషేధం ఎత్తేయడంతో ఇండోనేషియా రైతులు, వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇండోనేషియా మరియు మలేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారులు. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలలో పామాయిల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో 85% వాటా వారిదే. అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరలు పెరుగగా ఇండోనేషియా నిషేధం విధించడంతో అనేక దేశాల్లో వంట నూనెల ధరలు రెండు వందల శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిషేధం ఎత్తేయడంతో భారత్ వంటి దేశాల్లో వంటనూనెల ధరలు దిగివచ్చే అవకాశం ఏర్పడింది. భారతీయులు వాడే అనేక వంటనూనెల ధరలు తగ్గించేందుకు పామోలిన్ కలుపుతారన్న విషయం తెలిసిందే. ఉత్పత్తి, ఎగుమతులలో అగ్రగామి అయిన ఇండోనేషియా నిషేధం ఎత్తేస్తున్నట్లు ప్రకటించడంతో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి