
IndusInd Bank: గడచిన కొన్ని నెలలుగా ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని టాప్ బ్యాంకర్లలో ఒకటిగా ఉన్న ఇండస్ఇండ్ బ్యాంకు పనితీరు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో బ్యాంకుకు సంబంధించిన కొన్ని డెరివేటివ్స్ ట్రేడింగ్ నష్టాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
నేడు ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ మార్కెట్లో 4 శాతానికి పైగా నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అనేక బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ షేర్లతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లను హెచ్చరించిన వేళ బ్యాంక్ స్టాక్ పతనాన్ని చూస్తోంది. వాస్తవానికి అనలిస్టులు కంపెనీ షేర్లను డౌన్ గ్రేడ్ చేయటంతో పాటు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి 2027 ఆర్థిక సంవత్సరం మధ్య ఆదాయాలు తగ్గుతాయని కూడా అంచనా వేయటం ఆందోళనలను మరింతగా పెంచేస్తోంది.
తాజాగా బ్యాంక్ నిర్వహించిన అంతర్గత ఆడిట్ లో తమ మైక్రోఫైనాన్స్ వ్యాపారంలో తప్పులను గుర్తించినట్లు స్టాక్ మార్కెట్లకు గురువారం వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలకు గాను రూ.674 కోట్లను తప్పుగా వడ్డీ ఆదాయంగా చూపించినట్లు అందులో పేర్కొంది. అయితే దీనిని జనవరి 10, 2025న సరిదిద్దినట్లు ఆడిట్ కమిటీ గుర్తించింది. వాస్తవానికి బ్యాంకులోని విజిల్ బ్లోవర్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తేలింది. ఆడిట్ కమిటీ దర్యాప్తులో ఎలాంటి డాక్యుమెంట్లు లేని రూ.595 కోట్ల బ్యాలెన్స్ గుర్తించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ అకౌంటింగ్ తప్పులకు బాధ్యులైన ఉద్యోగులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
గతంలో బయటపడ్డ డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో వివాదం కారణంగా బ్యాంక్ ఎండీ & సీఈవో సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానాలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత బ్యాంక్ కొత్త సీఈవోను నియమించలేదు. అప్పట్లో బ్యాంక్ ప్రమోటర్స్ అయిన హిందూజా గ్రూప్ కస్టమర్లు, స్టేక్ హోల్డర్లలో నమ్మకాన్ని నింపేందుకు కీలక ప్రకటన చేసింది. డెరివేటివ్స్ ట్రేడింగ్ వల్ల వచ్చిన నష్టం కంటే బ్యాంక్ లాభాలు ఎక్కువగా ఉన్నాయని, అవసరమైతే బ్యాంకింగ్ వ్యాపారంలో కొత్త పెట్టుబడి రూపంలో డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాయమని కూడా ప్రకటించింది. కానీ ఇది జరిగిన కొన్ని నెలల్లోనే మరోసారి బ్యాంకు ఖాతాల్లో అకౌంటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది.
ఉదయం 10.52 గంటల సమయంలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ల ధర ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.760 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లపై బై రేటింగ్ తొలగించి హోల్డ్ రేటింగ్ ఇచ్చింది. ఇదే క్రమంలో ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా షేర్లకు టార్గెట్ ధరను రూ.780కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.