
- గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన
- వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఏటీసీ సెంటర్‌కు భూమి పూజ
కొడంగల్/పరిగి, వెలుగు:ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో రూ.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో కొత్తగా నిర్మించే ఏటీసీ కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు.
పదో తరగతి పాసైన యువతకు ఏటీసీలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు. యువత దీనికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.4 వేల కోట్ల నిధులతో ఏటీసీ, ఐటీఐలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రూ.7.2 కోట్లతో హాకీంపేటలో నిర్మించే ఏటీసీ.. యువత భవిష్యత్తును మార్చేలా ఉంటుందని పేర్కొన్నారు. భవన నిర్మాణమే కాకుండా ఆధునాతన యంత్రాల కొనుగోలుకు రూ.36 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు అందుబాటులో ఉండేలా ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
యువతను ప్రోత్సహించండి..
యువత సాంకేతిక రంగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉపాధి పొందాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. టెక్నాలజీని
అందిపుచ్చుకుంటే ఉద్యోగాలు పొందడం సులభమని పేర్కొన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యువతను ప్రోత్సహిస్తూ ఏటీసీల్లో చేరేలా చూడాలని ఆదేశించారు. ఇలాంటి మంచి అవకాశాన్ని గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్ రెడ్డి, ఇండస్ట్రీస్ జోనల్ మేనేజర్ కవిత, ఏటీసీ ప్రిన్సిపల్ కన్వీనర్ నరేంద్ర బాబు, ఏటీసీ ప్రిన్సిపల్ శ్యాం సుందర్, తహసీల్దార్ కిషన్ ఉన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామికి మాల సంఘాల సన్మానం
మాలలు సంఘటితమై హక్కులను సాధించుకోవడంతో పాటు రాజకీయంగా ఎదగాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్తుండగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పరిగికి మొదటిసారి రావడంతో మాల మహానాడు నేతలు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు వివేక్‌ను సన్మానించారు.
పరిగి మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో మాల మహానాడు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, అంబేద్కర్ విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రిని గజమాలతో సత్కరించారు. ఈ మేరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన వాటా ఇప్పించాలని, రోస్టర్ పాయింట్‌లో మాలలకు జరిగిన అన్యాయం సరిచేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జీవో 5 ప్రకారం ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇన్ ఎడెక్వేసీ ద్వారా ఎవరి వాటా వారికి ఇవ్వాలని, అందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాల మాహానాడు రాష్ట్ర నాయకుడు శివరాజు, బీసీ సంఘం నాయకుడు లాల్ కృష్ణ, మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి ఆర్.రాములు, నాయకులు కోళ్ల యాదయ్య, సుల్తాన్‌పూర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.