
- 2023-24లో 128 మంది..
- 2024-25లో 125 మంది మృతి
యాదాద్రి, వెలుగు: జిల్లాలో శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కండ్లు తెరిచి తెరవకముందే.. మృత్యుఒడికి చేరుతున్నారు. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపం, సరైన వైద్యం అందక, నెలలు నిండకముందే జన్మించి కొందరు, న్యూమోనియా, వివిధ రకాల వ్యాధులతో కొందరు చనిపోతున్నారని హెల్త్ డిపార్ట్మెంట్లెక్కలు చెబుతున్నాయి
హాస్పిటల్స్అందుబాటులో ఉన్నా..
యాదాద్రి జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3 సీహెచ్‌సీలు, భువనగిరిలో జిల్లా ఆస్పత్రి వైద్య సేవలందిస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్ దగ్గరగా ఉండడంతో ఎక్కువ మంది డెలివరీ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వెళ్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో గతంతో పోలిస్తే మెరుగైన ట్రీట్మెంట్అందుతోంది. అయినా, చనిపోతున్న చిన్నారుల సంఖ్య తగ్గడం లేదు. పుట్టిన గంటల్లో కొందరు, కొన్ని రోజుల తర్వాత మరికొందరు మృతిచెందుతున్నారు.
2024 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 125 మంది పిల్లలు చనిపోయారు. ఈ లెక్కన రోజుకు ముగ్గురు చనిపోతున్నట్లే. 2025 జనవరి నుంచి మార్చి వరకు 27 మంది పిల్లలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చిన్నారులు మృతి చెందితే కొందరు మధ్యవర్తులు రంగప్రవేశం చేసి, డాక్టర్లు, మృతుల కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరుపుతున్నారు. ఏంతో కొంత పరిహారం ఇప్పిస్తుండటంతో ఆ లెక్కలు పెద్దగా బయటకు రావడం లేదు.
మగ పిల్లలే ఎక్కువ..
మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మగ పిల్లలే ఉంటున్నారు. ఇందుకు బరువు తక్కువగా ఉండడమే కారణం. న్యూమోనియాతో ఆడ శిశువులు మరణిస్తున్నారు. అయితే, ఈ రెండు కారణాలు కాకుండా ఇతర డిసీజ్‌ల వల్ల చనిపోయిన వారిలో మగ శిశువులే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకు మృతిచెందిన వారిలో గుండెకు రంధ్రం పడిన ఒక చిన్నారి కూడా ఉంది.
రాత్రివేళల్లో ఉండని డాక్టర్లు
అవగాహన లోపం, పేదరికం కారణంగా ట్రీట్మెంట్, పోషకాహారం విషయంలో గర్భిణులు శ్రద్ధ తీసుకోవడం లేదు. సర్కారు డాక్టర్లు ఎక్కువగా హైదరాబాద్ నుంచి హాస్పిటళ్లకు వచ్చి వెళ్తున్నారు. ప్రతీరోజు ఓపీకి ముందే గూగుల్మీట్నిర్వహిస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. గవర్నమెంట్ డాక్టర్లే కాదు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్డాక్టర్లు కూడా పగలంతా ఇక్కడే ఉండి, రాత్రి వేళల్లో ఉండడం లేదు. పైగా కొన్ని ఏరియాల్లో అర్హత లేని వైద్యులు డెలివరీ చేస్తున్నా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పెద్దగా యాక్షన్ ఉండడం లేదు.