
- దొంగలు యూపీకి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి సంతోషి జువెలరీ షాపులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన భారీ గోల్డ్ చోరీలో పోలీస్ అధికారులు అన్నీ ఆధారాలు పక్కాగా సేకరిస్తున్నారు. జిల్లాకేంద్రంలో సంచలనం సృష్టించిన కేసులో పోలీసులు ఎంక్వైరీని స్పీడప్ చేయడంతో ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. చోరీ జరిగిన విధానాన్ని అంచనా వేసి యూపీలోని కబుజర్ గ్యాంగ్ పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క సీసీ టీవీ ఫుటేజ్ బయటపడడంతో ముమ్మరం దర్యాప్తు చేపట్టారు.
రూ. కోట్ల విలువైన బంగారాన్ని చోరీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కేసును త్వరితగతిన చేధించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. యూపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు రెండు నెలల కింద జిల్లా కేంద్రంలోని బాలాజీ గ్రాండ్‌హోటల్ సమీపంలో ఓ పాత ఇంట్లో అద్దెకు ఉండేందుకు అడ్వాన్స్ ఇచ్చారు. ఇంటి యజమానికి బస్టాండ్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నామని చెప్పి రెంట్ కు తీసుకున్నట్టు తెలిసింది. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నుంచి అటువైపు వెళ్లలేదు.
మళ్లీ వారం రోజుల కింద రూమ్ లో దిగారు. అయితే గోల్డ్ షాప్ కు సమీపంలోనే అద్దె గది ఉంది. దీంతో చోరీ చేసేందుకు రెక్కీ చేసినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది. ఆదివారం సాయంత్రం కూడా ఆ రూమ్ కు సమీపంలోని ఓ కిరాణ షాపులో వాటర్ బాటిల్ కొనుగోలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అదేరోజు అర్ధరాత్రి గోల్డ్ షాపులో చోరీకి పాల్పడగా , సోమవారం ఉదయం నుంచి రూమ్ కు లాక్ చేసి ఉంది. అంతకుముందే తెల్లవారుజామున సుమారు 3.30గంటల సమయంలో రూమ్ లోంచి బ్యాగ్‌లు వేసుకొని ఐదుగురు వ్యక్తులు వెళ్తున్నట్టు సీసీ కెమెరాలో రికార్డైంది.
క్లూస్ టీంతో ఫింగర్ ప్రింట్స్ సేకరణ
సీసీ కెమెరాల ఫుటేజ్ ల ఆధారంగా నిందితులను షాపు సమీపంలోని పాత ఇంట్లో అద్దెకు ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. మంగళవారం క్లూస్‌టీం సిబ్బంది చోరీ జరిగిన స్థలంలోనూ అద్దెకు ఉన్న రూమ్ లోనూ ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అవి మ్యాచ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో ఒక దొంగకు చెందిన ఫింగర్ ప్రింట్స్ దొరకడంతో అతను యూపీ, బిహార్ బార్డర్ గ్రామానికి చెందిన పాత నేరస్తుడిగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీస్ బృందాలు యూపీ పాటు జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లినట్టు తెలిసింది.