Ram Charan-Upasana : రామ్ చరణ్-ఉపాసన కొత్త లగ్జరీ ఫామ్‌హౌస్.. ఊరు చివర 5 ఎకరాల్లో మెగా సామ్రాజ్యం!

Ram Charan-Upasana : రామ్ చరణ్-ఉపాసన కొత్త లగ్జరీ ఫామ్‌హౌస్.. ఊరు చివర 5 ఎకరాల్లో మెగా సామ్రాజ్యం!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలతోనే కాదు.. వ్యాపారాలు, పెట్టుబడులు, లగ్జరీ ఆస్తులతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు విలాసవంతమైన ఆస్తులతో పాటు పలు వ్యాపారాలు కలిగిన ఈ మెగా పవర్ స్టార్.. తన భార్య ఉపాసన కామినేని కొణిదెలతో కలిసి లేటెస్ట్ గా మరో డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.

విలాసవంతమైన ఫామ్‌హౌస్ ..

హైదరాబాద్ శివారులోని చెవెళ్ల–మోకిలా ప్రాంతంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఇప్పుడు పూర్తిగా సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితమే ఈ భూమిని కొనుగోలు చేసిన ఈ దంపతులు, అత్యాధునిక సౌకర్యాలతో, ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించేలా ఈ ఫామ్‌హౌస్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. త్వరలోనే కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో గృహప్రవేశ వేడుక నిర్వహించే అవకాశముందని సమాచారం.

వీకెండ్ రిట్రీట్‌గా.. 

ఈ ఫామ్‌హౌస్‌ను నగర రద్దీకి దూరంగా వీకెండ్ రిట్రీట్‌గా ఉపయోగించాలనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ భూమిలో కొంత భాగాన్ని ఆర్గానిక్ వ్యవసాయానికి కేటాయించాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆసక్తి ఉన్న రామ్ చరణ్‌కు ఇది ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారనుంది.

►ALSO READ | Kotha Cinema: ‘సినిమా’ పిచ్చితో హీరోగా కిరాణం షాపు నడిపే వ్యక్తి.. మట్టి మాటలు, మట్టి కథ.. ఎమోషనల్ స్పీచ్

ఇక ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ప్రముఖ డిజైనర్లు ఆమిర్, హమీదా శర్మ (AANDH) ఈ ఫామ్‌హౌస్‌కు అద్భుతమైన డిజైన్ అందించినట్లు సమాచారం. ఆధునిక శైలి, విలాసవంతమైన ఇంటీరియర్స్, ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ ఈ ఫామ్‌హౌస్‌ను ప్రత్యేకంగా రూపొందించారట. నిర్మాణం, ఇంటీరియర్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

' పెద్ది'తో ఫుల్ జోష్.. 

ఇదిలా ఉండగా, రామ్ చరణ్ ఇటీవల బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. జూన్ 4న విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా విజయోత్సాహంతో పాటు కొత్త ఫామ్‌హౌస్ వార్త కూడా అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.