కొడుకు కోసం కోచ్ పదవి వదిలేసింది

కొడుకు కోసం కోచ్ పదవి వదిలేసింది

ఆరేండ్ల వయసులో హాకీ స్టిక్​ పట్టింది మాలతి. స్టేట్ టీంలోనూ  సెలక్ట్​ అయింది. కానీ, పేదరికం పెండ్లి వైపు నడిపించిందామెని.పెండ్లి తర్వాత కూతురు కష్టాలన్నీ తీరాయి అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ, అక్కడా నిరాశే. చీకట్లో దాక్కొని ఎన్నో కన్నీళ్లు కార్చింది. కష్టం కూసింతైనా కరగలేదు. అయినా కుంగిపోలేదు.. తనకి తానే ధైర్యం చెప్పుకుంది. లక్నో మొదటి మహిళా ఆటో రిక్షా డ్రైవర్​గా మారి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమె జర్నీ ఇది..

పెద్ద హాకీ ప్లేయర్​ అవ్వాలన్నది మాలతి కల. అందుకోసం ఆరేండ్ల వయసు నుంచే కష్టపడింది. ఆ కష్టానికే తగ్గట్టే యూపీ స్టేట్​ టీమ్​లోనూ సెలక్ట్​ అయింది. కొన్ని మ్యాచ్​లు కూడా ఆడింది. కానీ, ఆ లోపే  మంచి సంబంధం అంటూ వాళ్ల నాన్న పెండ్లి కుదిర్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల మాలతి కూడా మౌనంగా ఉండిపోయింది. తన కల​లు అన్నింటినీ పుట్టింట్లోనే వదిలేసి.. అత్తారింటికెళ్లింది. కానీ, పెండ్లయిన రెండో రోజు నుంచే భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. అయినా భరించింది. కానీ, కొడుకు పుట్టాక ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దాంతో తన కష్టం తన కొడుకుకి వద్దనుకుంది. ఆ రిలేషన్​ నుంచి బయటికి వచ్చింది.

ఎగతాళి చేశారు
చేతిలో రూపాయి లేదు.. ఆస్తిపాస్తులూ లేవు. దాంతో ఉద్యోగం కోసం వెతుకులాట మొదలుపెట్టింది మాలతి. ఆ ప్రయత్నాల్లోనే లక్నోలోని బాబు బనారసీ దాస్​ యూనివర్సిటీ గల్స్​​ హాకీ టీమ్​కి కోచ్​గా జాబ్ తెచ్చుకుంది. కానీ, ఆ సంతోషం మాలతికి ఎన్నో రోజులు నిలవలేదు. కొడుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో  ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. కొడుకు హెల్త్​ కాస్త కుదుటపడ్డాక ఉద్యోగం కోసం ఏ ఆఫీసుకెళ్లినా రిజెక్షనే ఎదురయింది. దాంతో దొరికిన పనల్లా చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. చివరికి మాలతి పరిస్థితిని అర్థం చేసుకున్న ఒక ఎన్జీవో సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆమెకి ఆటో రిక్షా ​ నేర్పించి.. గవర్నమెంట్​ సాయంతో ఆటో కూడా ఇప్పించింది. అలా లక్నో మొదటి మహిళా ఆటో రిక్షా డ్రైవర్​గా మారింది మాలతి. కానీ, మొదట్లో చాలామంది మాలతిని చూసి నవ్వారు. ఎగతాళి చేశారు. కొందరు ‘ఆడవాళ్లు డ్రైవింగ్​ ఏంటి’? అని ఆటో ఎక్కలేదు కూడా. అయినా,  అన్నింటినీ ఎదిరించింది. గెలిచి మరికొందరికి ఇన్​స్పిరేషన్​గా నిలిచింది.