జీవితం కొందరికి అన్నీ ఇస్తుంది. కొందరికి మాత్రం ఏమీ ఇవ్వకుండా ‘నీకు కావాల్సినవి నువ్వే సంపాదించుకో’ అని సవాలు విసురుతుంది. ఆ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసినవాడు సక్సెస్ చూస్తాడు. చేయనివాడు అలాగే మిగిలిపోతాడు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న వ్యక్తి మొదటి రకం. జీవితం తనకు పెట్టిన పరీక్షలో నెగ్గి ఈరోజు కోట్లకు అధిపతయ్యాడు. కష్టాన్ని నమ్ముకున్న ఆయన్ని సక్సెస్ వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఒక పెద్ద క్యాబ్ కంపెనీకి ఓనర్ అయిన ‘రేణుకా ఆరాధ్య’ గురించి తెలుసుకోవాల్సిందే.
‘‘కష్టమనేది లేని రోజంటూ లేదు కదా.. కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా..” అనే సినిమా పాట ఈయన లైఫ్‌కి సరిగ్గా సరిపోతుంది. ఈయన జీవితంలో ఎదురైనన్ని కష్టాలు ఎక్కడా చూసి ఉండరు. ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలతోనే కాలక్షేపం చేస్తూ పెరిగాడు ఆరాధ్య. పూటగడవని స్థితిలో అడుక్కుని తిని బతికిన ఆయన ఈ రోజు 50 కోట్ల కంపెనీకి అధిపతి. ఈయన జీవితంలో ప్రతి మజిలీ స్ఫూర్తిదాయకమే.
కర్ణాటకలో బెంగళూరుకు దగ్గర్లో ఉన్న అనేకల్ తాలుకాలో గోపసంద్ర గ్రామంలో పుట్టాడు రేణుకా ఆరాధ్య. ఆరాధ్యకు ఒక చెల్లి, ఒక తమ్ముడు. ముత్యాలమ్మ దేవి టెంపుల్లో ఆరాధ్య తండ్రి పూజారిగా ఉండేవాడు. రోజుకి ఒకటి లేదా రెండు రూపాయలు మాత్రమే సంపాదించేవాడు ఆయన. చాలీచాలని ఆ డబ్బుతో పూట గడవడం కష్టమయ్యేది. దాంతో ఆలయంలోని కొద్దిపాటి భూమిలో రాగులు, వరి సాగు చేసేవాళ్లు. వాటి ద్వారా వచ్చే డబ్బు కూడా కొంచెమే కావడంతో వాళ్ల అవసరాలు తీరేవి కావు.
బాల్యంలో భిక్షాటన
గుడిలో పని అయిపోయిన తర్వాత ఆరాధ్య, వాళ్ల నాన్న ఇద్దరూ కలిసి ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేసేవాళ్లు. రాగులు, జొన్నలు లేదా బియ్యం వంటివి దానం చేస్తే.. వాటిని సేకరించి మార్కెట్‌లో అమ్మేవాళ్లు. వచ్చిన డబ్బుతో వాళ్ల ఇంట్లోకి అవసరమైన వస్తువుల్ని కొనుక్కునేవాళ్లు. అటువంటి పరిస్థితుల్లో కూడా.. ఆరాధ్య చదువు మానేయలేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడు. ఫీజు టీచర్లు కట్టేవాళ్లు. వాళ్ల డబ్బు ఫ్రీగా తీసుకోవడం నచ్చక టీచర్ల ఇంట్లో పనిచేసేవాడు ఆరాధ్య. ఆరోతరగతి పూర్తయ్యాక ఆరాధ్యను తండ్రి కావేరప్ప అనే అతని ఇంట్లో పనికి పెట్టాడు. ఇంట్లో ఆవుల్ని చూసుకుంటూ లోకల్ స్కూల్లో ఒక సంవత్సరం చదివాడు. ‘‘వాళ్లు నాకు తిండి సరిగా పెట్టేవాళ్లు కాదు. చాలాసార్లు ఆకలితోనే ఉండేవాడ్ని. స్కూల్లో నేర్చుకున్నదానికంటే ఆ ఇంట్లోనే ఎక్కువ నేర్చుకున్నా” అని నవ్వుతూ చెప్తాడు ఆరాధ్య.
పది ఫెయిల్..
కొడుకు పడుతున్న బాధలు అర్థం చేసుకున్న ఆరాధ్య తండ్రి, అక్కడి నుంచి తీసుకొచ్చి బెంగళూరులోని చిక్‌పేటలో ఉన్న మహంతీర మఠంలో చేర్చాడు. అక్కడ ఉదయం 8, సాయంత్రం 8గంటలకి రెండు పూటలు భోజనం పెట్టేవాళ్లు. మధ్యలో ఏమీ పెట్టరు. దాంతో ఆకలివేసినప్పుడు తనతోపాటు ఉన్న కొందరితో కలిసి కెంపెగౌడ రోడ్లో ఉన్న ఎస్‌బిఎమ్ సర్కిల్ దగ్గరకి వెళ్లేవాళ్లు. అక్కడ పండ్ల వ్యాపారులు పనికిరావని పడేసిన పండ్లు తినేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో ఆరాధ్య టెన్త్ ఫెయిల్ అయ్యాడు. దాంతో తిరిగి ఇంటికొచ్చేశాడు.
చెడు అలవాట్లకు బానిసై..
అప్పటికే నాన్న చనిపోవడంతో అమ్మను చూసుకునే బాధ్యత ఆరాధ్యపై పడింది. తోబుట్టువులు ఆరాధ్యకు సాయంగా నిలిచే స్థితిలో లేరు. ఇక చేసేదేం లేక చదువు మానేసి, పనిచేసి సంపాదించాలి అని డిసైడ్ అయ్యాడు. వాళ్లమ్మతో కలిసి బెంగళూరుకి మకాం మార్చారు. అక్కడే చిన్న చిన్న జాబ్స్ చేసేవాడు ఆరాధ్య. లాత్ మెషిన్స్‌లో పనిచేశాడు. ప్లాస్టిక్ పాత్రలు, ఐస్‌క్రీమ్ తయారీ ఫ్యాక్టరీల్లో పనిచేశాడు. యాడ్‌ల్యాబ్స్ స్టూడియోలో మూడేండ్లు స్వీపర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత శ్యాం సుందర్ ట్రేడింగ్ కో. కంపెనీలో ప్యాకింగ్, బ్యాగ్స్ సరఫరా, ట్రాలీల్లో సూట్‌కేసులు పెట్టుకుని తీసుకెళ్లడం వంటి పనుల్లో హెల్పర్‌గా చేశాడు. కొద్దిరోజుల తర్వాత హోల్‌సేల్‌లో సూట్‌కేసులు కొని సొంతగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. తోపుడు బండ్ల మీద పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్మేవాడు. కానీ.. బిజినెస్ సరిగా సాగక 30 వేలు నష్టం వచ్చింది. ఆ టైంలో పేకాట, మందు తాగడం అలవాటైంది.
భార్య సంపాదన తోడైంది
కొంత కాలం గడిచాక తన జీవితం గురించి బాగా ఆలోచించాడు. చెడు అలవాట్లు అన్నీ వదిలేసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. 20 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకున్నాడు. భార్యను గార్మెంట్ పనిలో పెట్టాడు. తను నాలుగైదు ప్లేసుల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసి నెలకి 600 రూపాయలు సంపాదించేవాడు. ఆ తర్వాత కూడా కొన్ని చిన్నాచితకా పనులు చేశాడు. కొబ్బరి చెట్లు ఎక్కినందుకు 20 రూపాయలు, కొబ్బరి బోండాలు తెంపినందుకు15 రూపాయల చొప్పున డబ్బు తీసుకునేవాడు. ఈ పనులు చేస్తున్న టైంలోనే డ్రైవర్లతో పరిచయం ఏర్పడింది. దాంతో తను కూడా డ్రైవర్ కావాలనుకున్నాడు. తెలిసినవాళ్ల దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అది సరిపోదని తన పెండ్లి ఉంగరాన్ని అమ్మాడు. ఆ డబ్బుతో డ్రైవింగ్ నేర్చుకుని, లైసెన్స్ తెచ్చుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు, కొన్నిగంటల్లోనే కారుతో గేటును గుద్దాడు. దాంతో డ్రైవర్ కావాలన్న ఆశ కాస్త ఆవిరైపోయింది. దాంతో మళ్లీ సెక్యూరిటీ గార్డుగా కంటిన్యూ అయ్యాడు. తన ఆశలన్నీ అడియాశలైపోయే సరికి సంపాదన గురించి మళ్లీ దిగులు మొదలైంది.
సక్సెస్ జర్నీ స్టార్ట్
23 ఏండ్లకు కొడుకు పుట్టాడు. కుటుంబ భారం పెరిగింది. ఆరాధ్య మళ్లీ డ్రైవర్ పనిలో చేరాలి అనుకున్నాడు. కానీ.. మొదట జరిగిన సంఘటన గుర్తొచ్చి కాస్త భయపడ్డాడు. అప్పుడే ఒక ట్యాక్సీ ఆపరేటర్ నమ్మకంతో ఆరాధ్యకు ట్రైనింగ్ ఇచ్చి పనిలో పెట్టుకున్నాడు. టూరిస్ట్‌లను కారులో ఎక్కించుకుని తిప్పి చూపించడమే ఆరాధ్య పని. కస్టమర్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ రావడంతో రెండేండ్లు ఆ ఆపరేటర్‌తో కలిసి పనిచేశాడు. తర్వాత ట్రాన్స్పోర్ట్ కంపెనీలో చేరాడు. అందులో హాస్పిటల్ నుంచి ఇండ్లకు శవాలను మోసుకెళ్లే పనిచేశాడు. ఆ కంపెనీ డెవలప్ అవుతుండడంతో ఆరాధ్యకు మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చింది.
2000వ సంవత్సరంలో ఆరాధ్య మొదటిసారి సొంతంగా కారు కొన్నాడు. కొన్నేండ్లకు ఆరు కార్లు కొన్నాడు. వాటికి 12 మంది డ్రైవర్లను పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా 2006లో, ‘ఇండియన్ సిటీ ట్యాక్సీ’ అనే కంపెనీ భారీ నష్టాల్లో ఉండి, వాళ్ల దగ్గరున్న దాదాపు 80 కార్లను అమ్మాలనుకున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే ఆరాధ్య ఆ కంపెనీలో ఉన్న కార్లన్నీ కొన్నాడు. ‘ప్రవాసీ క్యాబ్స్’ పేరుతో క్యాబ్ సర్వీస్ రిజిస్టర్ చేయించాడు. 2007లో అసలైన సక్సెస్ మొదలైంది. నెమ్మదిగా 80 కార్లు కాస్త 300లకు చేరాయి. 2018లో ఓలా, ఉబెర్ వంటి పెద్ద కంపెనీల నుంచి పోటీ ఎదురైంది. కానీ, ప్రవాసీ క్యాబ్స్ పాపులారిటీని అవేం చేయలేకపోయాయి. ఒకవేళ పరిస్థితి తిరగబడినా భయపడే వ్యక్తి కాదు ఆరాధ్య. ప్రస్తుతం 50 కోట్ల టర్నోవర్‌తో దూసుకెళ్తోన్న బిజినెస్‌ను ఫ్యూచర్లో వంద కోట్ల మార్క్‌కి చేర్చడమే లక్ష్యం అంటున్నాడు. ప్రస్తుతం ఆయన దగ్గర వెయ్యికి పైగా కార్లున్నాయి. వాటిలో దాదాపు 300 కార్లు ఆయన సొంతవే. అంతేకాదు.. క్యాబ్ బిజినెస్‌తోపాటు 2012లో ఏడు స్కూల్ బస్సులు కొన్నాడు. 2016 నాటికి అవి 40కి చేరాయి. ఇలా ప్రవాసీ సక్సెస్ నేటికీ కంటిన్యూ అవుతూనే ఉంది.
కల నెరవేరింది
పంతొమ్మిదేండ్ల వయసులో నా కొడుక్కి పద్దెనిమిదేండ్ల అమ్మాయితో పెండ్లి చేశా. ఆమె కూడా పేద కుటుంబం నుంచే వచ్చింది. పెండ్లయ్యాక ఇద్దరూ కామర్స్‌లో డిగ్రీ చేశారు. ఇప్పుడు మా అబ్బాయి ప్రవాసీ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కోడలు కూడా బిజినెస్ చూసుకుంటోంది. మనవడు చదువుకుంటున్నాడు. డ్రైవర్‌గా ఉన్నప్పుడు.. ‘ఈరోజు ట్రిప్ షీట్ సబ్మిట్ చేసే నేను.. ఏదో ఒకరోజు దాన్ని కలెక్ట్ చేసే స్థాయిలో ఉంటాను’ అనుకునేవాడిని. ఆ కల ఇప్పుడు నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.
