ఎయిరిండియా కేసులో ట్విస్ట్.. మూత్రం పోయలేదన్న శంకర్ మిశ్రా

ఎయిరిండియా కేసులో ట్విస్ట్.. మూత్రం పోయలేదన్న శంకర్ మిశ్రా

ఎయిరిండియాలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తాను మహిళపై మూత్ర విసర్జన చేశారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవమూ లేదని చెప్పాడు. ఆ మహిళే మూత్ర విసర్జన చేసుకొని తనపై ఆరోపణలు చేస్తోందని వాదించాడు. ఆమె కూర్చున్న సీటు దగ్గరకు ఎవరైనా వెనుకవైపు నుంచే వెళ్లగలరన్న శంకర్.. ఆమెపై మూత్రవిసర్జన చేశాననుకుంటే..వెనుక లేదా పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికులు ఫిర్యాదు చేయాలి కదా? అని ప్రశ్నించాడు. తనను ప్రశ్నించేందుకు కస్టడీ కోరుతూ ఢిల్లీ పోలీసులు చేసిన దరఖాస్తుపై సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు ప్రతిస్పందనగా శంకర్ మిశ్రా తన సమాధాన తెలియజేశాడు. అనంతంరం కస్టడీ కోసం పోలీసుల అభ్యర్థనను తిరస్కరించిన ఢిల్లీ పటియాలా కోర్టు ... అతన్ని14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపేందుకు ఆదేశాలు జారీ చేసింది.

గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిరిండియా విమానంలో శంకర్ మిశ్రా మద్యం మత్తులో  ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శంకర్ మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో శంకర్ మిశ్రా కొన్ని రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరిగాడు. అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత.. శంకర్ మిశ్రాను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం అతను బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ.. కోర్టు అతని వాదన తిరస్కరించి జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. అయితే కోర్టు నోటీసులపై విచారణ సందర్భంగా తాను ఆ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేయలేదని, ఆమెనే మూత్రం పోసుకుందేమోనంటూ శంకర్ మిశ్రా అందరికీ షాక్ ఇచ్చాడు.