
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లాలో ఇంటర్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మిర్యాలగూడ టౌన్ లోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన మాదగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కొడుకు శ్రీనివాస్ ఈశ్వర్ (18), స్థానికంగా ఓ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇందిరమ్మ కాలనీ శివారులో ఈశ్వర్ డెడ్ బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వన్ టౌన్, రూరల్ సీఐలు మోతీరాం, ప్రసాద్, ఎస్ఐ సైదిరెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. ఈశ్వర్ గొంతును కోసినట్లు మెడపైన తీవ్రగాయాలు ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.