దశాబ్ది వేడుకల తర్వాత.. సీఎంవో, సమాచార శాఖ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ

  దశాబ్ది వేడుకల తర్వాత..    సీఎంవో, సమాచార శాఖ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ

 దశాబ్ది వేడుకల తర్వాత సీఎంవో, సమాచార శాఖ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఈ వేడుకల కోసం చేసిన పబ్లిసిటీ కార్యక్రమంలో జరిగిన వ్యవహారమే దీనికి కారణం. ఉత్సవాల పబ్లిసిటీ వీడియోల కోసం చాలా కంపెనీలు పోటీపడ్డాయి. వీడియో ప్రజెంటేషన్ బాగాచేస్తామని పలు ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొచ్చాయి. వాటిలోంచి బాగున్నవాటిని బట్టి ఏదో కంపెనీకి బాధ్యత అప్పగించాల్సి ఉంది. అయితే ముందుకొచ్చిన ఏ ప్రొడక్షన్ కంపెనీకి ఈ బాధ్యత ఇవ్వలేదు. ఏదో కారణం చెప్పి రిజెక్ట్ చేశారు. 

 ఇంత మంచి ప్రజెంటేషన్ ఇచ్చినా కాంట్రాక్ట్ ఎందుకు దక్కలేదని ప్రొడక్షన్ కంపెనీలకు చెందిన కొందరు ఆరాతీశారట. దీంతో అసలు విషయం అర్థమై సైలెంట్ అయ్యారు. సీఎంకు దగ్గరమనిషిగా పేరున్న ఓ పెద్దమనిషికి చెందిన కంపెనీకే పబ్లిసిటీ వీడియోల బాధ్యత అప్పగించారట. ఈ మాత్రం దానికి మమ్మల్ని పిలవడం ఎందుకని తెలిసినవాళ్ల దగ్గర గోడు చెప్పుకోవడంతో ఈ ముచ్చట బయటికొచ్చింది. 

 సీఎం దగ్గర చాలాకాలం ప్రత్యేక బాధ్యతలు చూసిన ఆ పెద్దమనిషికి ఈమధ్యే మంచి పదవి కూడా దక్కింది. పనిలోపనిగా పబ్లిసిటీ వీడియోల ప్రొడక్షన్ కంపెనీ వేరే పేరుతో నడుపుతున్నట్లు ఐఅండ్ పీఆర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రభుత్వ పబ్లిసిటీ సెల్ వ్యవహారాలన్నీ దాదాపుగా ఆ కంపెనీనే నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. దశాబ్ది వేడుకలకలో శాఖలకు సంబంధించిన వీడియోలు చాలావరకు ఈ కంపెనీకే అప్పగించారట. వేడుకల పేరుతో పొలిటికల్ పబ్లిసిటీ చేసుకున్న సర్కారు దీనికోసం అవసరానికి మించి బాగానే ఖర్చుపెట్టింది. దీంతో శాఖల పబ్లిసిటీ కార్యక్రమానికి ఒక్కోదానికి 50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఉన్నట్లు చెబుతున్నారు. 

 పబ్లిసిటీ ప్రయోజనం జరిగిందో లేదోగానీ పబ్లిసిటీ వీడియోలు చేసినవారికి మంచి ఆర్థిక ప్రయోజనమే జరిగిందని ఐఅండ్ పీఆర్ వర్గాల్లో సరదాగా చెప్పుకుంటున్నారు. పోటీకొచ్చిన ప్రొడక్షన్ కంపెనీలవాళ్లు మాత్రం కాస్త ఎక్కువే ఫీలయ్యారు. అయినవారికి ఆకులు కానివారికి కంచాలు పెట్టే సర్కారులో ఇందతా మామూలేనని సర్దుకున్నారు.