చిన్నారులతో వ్యభిచారం కేసులో ఆసక్తికర విషయాలు

చిన్నారులతో వ్యభిచారం కేసులో ఆసక్తికర విషయాలు

యాదాద్రి, వెలుగు : చిన్నారులతో వ్యభిచారం చేయిస్తున్న కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకుముందులా కాకుండా ఒక ప్రాంతంలోని ఇంటి నుంచి మరో ప్రాంతంలోని ఇంటికి మారుస్తూ బిజినెస్​ చేస్తున్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 2018లో 34 మంది పిల్లలను వ్యభిచార గృహం నుంచి విముక్తి కల్పించారు. అప్పటినుంచి వ్యభిచారం తగ్గుముఖం పట్టింది. కానీ, తాజాగా రెండు రోజుల కింద ఇద్దరు పిల్లలతో వ్యభిచారం చేయిస్తున్న సంగతి తెలుసుకున్న పోలీసులు వారిని విడిపించి, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిపిన విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి. వ్యభిచారం నిర్వహించడంలో యాదగిరిపల్లికి చెందిన అనసూర్య, యాదగిరిగుట్ట టౌన్​లోని గణేశ్​నగర్​సహా కొన్ని వీధులకు చెందిన మరికొందరు కొత్త పద్ధతులను కనిపెట్టారు. సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్​ సహా ఇతర జిల్లాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారితో సంప్రదింపులు జరిపి, ఇక్కడి వారిని అక్కడికి పంపించడం మొదలుపెట్టారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత మునుపటిలా వేశ్యల వేషధారణలో కాకుండా గృహిణుల్లా తయారు చేసి  పంపేవారు. తాజాగా పట్టుబడిన ఇద్దరు బాలికలను హుస్నాబాద్, తంగళ్లపల్లి సహా ఇతర ప్రాంతాలకు పంపేవారని తెలిసింది. ఒక్క యాదిరిగుట్ట, యాదగిరిపల్లికి చెందిన వారిలో 20 నుంచి 25 మంది ఇదే విధంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నట్టుగా తెలుస్తోంది. కొందరు ఏకంగా విటుల ఇండ్లలోకి వెళ్లి వచ్చేవారని సమాచారం. 

2018లో దాడులు

యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై 2018 జూలై 30 నుంచి 17 రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో 34 మంది చిన్నారులకు విముక్తి కలిగింది. 27 మంది నిర్వాహకులపై పీడీ యాక్ట్​ పెట్టారు. చిన్న పిల్లలకు హార్మోన్​ఇంజక్షన్లు ఇచ్చి వారు చిన్న వయసులోనే పెద్దవారుగా కనిపించేలా చేసేవారు. ఈ ఘటన తర్వాత వ్యభిచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాజాగా చిన్నారులకు సంబంధించిన కేసు నమోదైంది. 

చిన్నారి బయటకు వచ్చిందిలా

పోలీసుల దగ్గర ఉన్న చిన్నారిని ఆమె తల్లి పదేండ్ల క్రితం శోభకు అమ్మేసింది. వయసు వచ్చేంత వరకు చిన్నారిని సంరక్షించిన శోభ మూడేండ్ల క్రితం వ్యభిచార రొంపిలోకి దింపింది. శోభ మరణంతో అనసూర్య ఆ బాధ్యత తీసుకుంది. వినకపోతే చిత్రహింసలు పెట్టేది. దీంతో ఆ చిన్నారి గత నెల 22న యాదగిరిపల్లి నుంచి యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చేరుకుంది. చార్జీలకు కూడా డబ్బులు లేక అడుక్కుని రూ. 40 రూపాయలతో బస్సు ఎక్కి జనగామ చేరుకుంది. సిరిసిల్లలోని కంసాని శ్రీనివాస్​ దగ్గరకు వెళ్లాలనుకుని చేతిలో డబ్బులు లేకపోవడంతో మళ్లీ బిచ్చమెత్తింది. గమనించిన కొందరు స్టూడెంట్స్​ఆమెతో మాట్లాడి విషయం ఆరా తీసి, 100కు డయల్ చేసి సమాచారమిచ్చారు.