షాకింగ్: ఇండియన్ మసాలాలతో క్యాన్సర్‌.. పురుగుల మందులో వాడే కెమికల్

షాకింగ్: ఇండియన్ మసాలాలతో క్యాన్సర్‌.. పురుగుల మందులో వాడే కెమికల్

ఇండియన్స్ తింటున్న ఆహారపదార్థాలపై షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఇటీవల నెస్లీ బేబీ ఫుడ్ ప్రొడక్ట్ లో షుగర్ కంటేన్ ఎక్కువగా ఉందని నివేదికలు వచ్చాయి.  సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ ఇంతలోనే మళ్లీ ఓ డెంజర్ బెల్ మోగించింది. ఇండియాలో ప్రసిద్ధి చెందిన మసాలా ఉత్పత్తుల తయారీ సంస్థలు ఎవరెస్ట్‌, ఎండీహెచ్‌ నాలుగు ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని హాంకాంగ్‌ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ వెల్లడించింది. సాధారణ పరీక్షల్లో భాగంగా ఈ రెండు కంపెనీలకు చెందిన నాలుగు ఉత్పత్తుల నమూనాలను పరీక్షించారు. వాటిలో మానవ వినియోగానికి పనికిరాని ఇథిలీన్‌ ఆక్సైడ్‌ అనే పురుగుమందుల్లో ఉండే రసాయనం ఉన్నట్టు తేలింది. 

ఇవే ఆ మసాలాలు

ఆ నాలుగు ఉత్పత్తుల్లో ఒకటి ఎవరెస్ట్‌ కంపెనీకి చెందిన ఫిష్‌ కర్రీ మసాలా కాగా.. మిగతా మూడూ ఎండీహెచ్‌ స్పైసెస్ కు చెందిన మద్రాస్‌ కర్రీ పౌడర్‌ (స్పైస్‌ బ్లెండ్‌ ఫర్‌ మద్రాస్‌ కర్రీ), మిక్స్‌డ్‌ మసాలా పౌడర్‌, సాంబార్‌ మసాలా. వీటిలో తాము గుర్తించిన ఇథిలీన్‌ ఆక్సైడ్‌ను.. ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ సంస్థ గ్రూప్‌ 1 క్యాన్సర్‌ కారకంగా వర్గీకరించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని, ఇప్పటికే దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచినవాటిని తొలగించాల్సిందిగా విక్రేతలను ఆదేశించినట్టు వెల్లడించింది. 

రొమ్ము క్యాన్సర్‌, లింఫోమాకు కారణమయ్యే ఇథిలీన్‌ ఆక్సైడ్‌ ఆనవాళ్లు అందులో ఉన్నాయని హాంకాంగ్‌ సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ ప్రకటించింది. భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలను సింగపూర్‌ తన మార్కెట్ల నుంచి తీసేయాలని ఆదేశించింది. ఈ మసాలా బ్రాండ్‌ సింగపూర్‌లోని SP ముత్తయ్య & సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దిగుమతి జరిగింది. మార్కెట్‌ నుంచి ఆ మసాలా మొత్తాన్ని వెనక్కు తీసుకోవాలని  SP ముత్తయ్య & సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను SFA ఆదేశించింది.