ఆఫ్ ​క్యాంపస్​ వర్క్​కు అమెరికా ఓకే

ఆఫ్ ​క్యాంపస్​ వర్క్​కు అమెరికా ఓకే
  • కరోనాతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిన వేలాది ఇండియన్ స్టూడెంట్లకు ఊరట

అమెరికాలో కరోనా విపత్తు కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇండియాతో సహా వివిధ దేశాలకు చెందిన స్టూడెంట్లకు ట్రంప్ సర్కారు ఊరట కల్పించింది. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న స్టూడెంట్లు ఆఫ్ క్యాంపస్ వర్క్ కోసం అనుమతి పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత కొన్ని వారాలుగా క్యాంపస్ లు మూతపడటం, రూంలు ఖాళీ చేయాల్సి రావడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది స్టూడెంట్లకు ఇది పెద్ద ఉపశమనం కానుంది. విదేశీ స్టూడెంట్లు ఈ అవకాశం వినియోగించుకోవచ్చంటూ యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(USCIS) తెలిపింది.

వీరికే అర్హత…

అప్లికేషన్లను ఒక్కో దాన్ని పరిశీలించి, తగిన కారణాలు ఉన్నాయని భావిస్తేనే ఆఫ్ క్యాంపస్ వర్క్ ఆథరైజేషన్ కు ఆమోదం లభిస్తుందని USCIS చెప్పింది. ట్యూషన్ ఫీజులు,లివింగ్ కాస్ట్ అనుకోకుండా పెరగడం, అనూహ్యంగా ఆర్థిక సాయాన్ని కోల్పోవడం, విద్యా సంస్థల మూసివేత వల్ల కష్టాలు ఎదుర్కోవడం వంటి కారణాలను ఆఫ్ క్యాంపస్ వర్క్ కు అనుమతించేందుకు పరిగణనలోకి తీసుకోనున్నట్లు USCIS వివరించింది. అమెరికాలో దాదాపు 2.50 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్లు చదువుతున్నట్లు అంచనా. వీరిలో చాలామంది ఇండియా మార్చి 22న షట్ డౌన్ కావడానికి ముందే ఇక్కడికి వచ్చేశారు. కానీ రకరకాల కారణాల వల్ల ఇంకా కొన్ని వేల మంది అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పుడు ఇలాంటి వారికి అమెరికా సర్కారు నిర్ణయంతో ఊరట కలగనుందని చెప్తున్నారు.