అంతర్రాష్ట్ర నకిలీ వీసా ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర నకిలీ వీసా ముఠా అరెస్ట్

నిర్మల్, వెలుగు: అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ వీసాలు అంటగడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను నిర్మల్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు.  జిల్లాలోని సోన్‌‌‌‌, నిర్మల్, సారంగాపూర్ తదితర మండలాలకు చెందిన ముగ్గురు యువకులు ప్రైవేట్ జాబ్ కోసమని కరీంనగర్‌‌ వెళ్లారు. 

అక్కడ రేకుర్తిలోని ఓ ఇంట్లో రెంట్‌కు ఉంటుండగా, అదే ఇంట్లో అద్దెకు ఉండే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిపాన రాజేశ్‌కుమార్‌‌, బోయినిపల్లి మండలానికి చెందిన పెగ్గర్ల చంద్రశేఖర్‌‌తో పరిచయడం ఏర్పడింది. ఇప్పటికే చాలామందిని ఉద్యోగాల కోసం విదేశాలకు పంపించామని వారికి మాయమాటలు చెప్పారు. అనంతరం కరీంనగర్ లో ఉద్యోగం నచ్చక ఈ ముగ్గురు యువకులు ఇంటికి తిరిగి వచ్చారు. కాగా విదేశాలకు పంపిస్తామని అక్కడ మంచి జీతం ఉందని వారికి ఫోన్‌ చేసి నమ్మించారు. 

ఎక్కువ జీతంతో పాటు వీసాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.1.25 లక్షలు తమ అకౌంట్లలోకి బదిలీ చేయించుకున్నారు. అనంతరం వీరికి ఫేక్ వీసాలు  పంపించారు.  ఆ తర్వాత ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో సదరు యువకులు వీసాలను విచారణ చేయించారు. అవి నకిలీవని తేలడంతో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిలకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. టెక్నాలజీ సాయంతో నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద ఖరీదైన మొబైల్ ఫోన్ తో పాటు 11 సిమ్ కార్డులు, ఆర్మీ డ్రెస్, ఆర్మీ షూస్, ఆర్మీ రబ్బర్ స్టాంప్స్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్ లు, బ్యాంక్ పాస్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు.