అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : ఆదిలాబాద్  జిల్లాలో గంజాయి స్మగ్లింగ్  చేస్తున్న అంతర్రాష్ర్ట ముఠాను సీసీఎస్​ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ డి.ఉదయ్​ కుమార్​ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ర్టం నుంచి మహారాష్ర్ట మీదుగా ఆదిలాబాద్​కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో సీసీఎస్​ పోలీసులు గురువారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​ వద్ద నిఘా పెట్టారు. 

సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు, ఒక మహిళ బ్యాగులు వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులను వారిని సమీపించేందుకు వెళ్లగా పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుల వద్ద  రూ.9.25 లక్షల విలువ చేసే 37 కిలోల బరువున్న 21 గంజాయి ప్యాకెట్లు, ఒక కారు, 3 సెల్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

పట్టుబడిన వారిని ఒడిశా రాష్ర్టం శంబల్​పూర్​ జిల్లాకు చెందిన నరేంద్ర మగర్​, రాజా రన్​బిడే, మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లా కిన్వట్​కు చెందిన షేక్​ జావెద్, షేక్​ రుక్సానాగా గుర్తించారు. షేక్​  ఖుర్భాన్​  పారిపోయాడు. నిందితులపై కేసు నమోదు చేశారు. స్మగ్లర్ల ముఠాను పట్టుకున్న సీసీఎస్​ సీఐ డి.సాయినాథ్​, సిబ్బందికి ఎస్పీ ఉదయ్  కుమార్  రెడ్డి రివార్డులను అందజేశారు.